Homeఆంధ్రప్రదేశ్‌Mudragada Padmanabham: ఆ అవమానమే కారణమా...? ముద్రగడ అందుకే జనసేనలోకి..?

Mudragada Padmanabham: ఆ అవమానమే కారణమా…? ముద్రగడ అందుకే జనసేనలోకి..?

Mudragada Padmanabham: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం యూ టర్న్ తీసుకున్నారు. టిడిపి, జనసేనో .. ఏదో ఒక పార్టీలో చేరనున్నారు. జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. వైసిపి చివరి వరకు ప్రయత్నిస్తున్నా ఆయన పెద్దగా స్పందించినట్లు లేదు. వైసీపీతో తనకు కుదరదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అటు అనుచరులు సైతం జనసేనలో చేరడమే ఉత్తమమని సూచిస్తున్నారు. దీంతో నిర్ణయంపై ముద్రగడ కుటుంబ సభ్యులు, అభిమానులతో చర్చిస్తున్నారు. ముద్రగడ తొలుత వైసీపీలో చేరతారని.. ప్రకటనే తరువాయి అన్నట్టు ప్రచారం జరిగింది. కానీ మధ్యలో వైసిపి నాయకత్వం తన మార్కు రాజకీయం చూపడంతో ముద్రగడకు అసలు తత్వం బోధపడింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరకూడదని ఒక నిర్ణయానికి వచ్చారు.

వాస్తవానికి ముద్రగడ ప్రత్యక్ష రాజకీయాలకు గత కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. కాపుల విషయంలో జగన్ ప్రభుత్వం ప్రతికూల నిర్ణయాలు తీసుకున్నా.. ఏనాడూ ముద్రగడ నోరు విప్పిన దాఖలాలు లేవు. పైగా టిడిపి పైనే తిరిగి విమర్శలు చేస్తూ లేఖలు విడుదల చేసేవారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో రాజకీయాల్లోకి రావాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు. తనతో పాటు కుమారుడికి టికెట్ ఇప్పించుకోవాలని చూస్తున్నారు. అయితే ముద్రగడ ఆసక్తిని గమనించిన వైసీపీ తమ పార్టీలో చేరాలని కోరింది. తద్వారా గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గంలో కొంతవరకు చీలిక తేవాలని జగన్ ప్రణాళిక సిద్ధం చేశారు. ముద్రగడను పార్టీలో చేర్చుకొని ఎక్కడో ఒకచోట సీటు ఇవ్వాలని భావించారు. ఈ విషయంలో జగన్ సన్నిహితుడు, ముద్రగడకు ఆత్మీయుడైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చొరవ చూపారు. కాకినాడ పార్లమెంట్ స్థానాన్ని ముద్రగడ తనయుడికి ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఎందుకో ఇది బెడిసి కొట్టింది.

ముద్రగడ పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒకచోట తనను సర్దుబాటు చేయాలని వైసిపి హై కమాండ్ కోరినట్లు తెలుస్తోంది. కానీ ముద్రగడ వినతిని పరిశీలించకుండా వైసిపి హై కమాండ్ ఏకంగా అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ముద్రగడ మనస్తాపానికి గురయ్యారు. ఒకానొక దశలో ఆయన తాడేపల్లికి వెళ్లినా జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. పైగా టికెట్ ఇచ్చినా ముద్రగడ కుటుంబం గెలిచే పొజిషన్ లో లేదని వైసిపి పెద్దలు తేల్చి చెప్పినట్లు సమాచారం. పార్టీ పరిశీలకుడు మిధున్ రెడ్డి సైతం సరిగ్గా స్పందించకపోవడంతో ముద్రగడ నొచ్చుకున్నారు. వైసిపికి ఇంతకాలం సహకరించినా.. తన విషయంలో ఇంత అమర్యాదగా వ్యవహరిస్తారా అని ముద్రగడ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. అందుకే వైసిపికి దూరం కావాలని ఒక నిర్ణయానికి వచ్చారు.

అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముద్రగడ జనసేనలో చేరే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు స్వయంగా ప్రకటించారు. వైసీపీలో చేరమని.. టిడిపి, జనసేనలో ఏదో ఒక పార్టీలో చేరుతామని వెల్లడించడం విశేషం. ఈసారి కచ్చితంగా పోటీలో ఉంటామని.. త్వరలోనే నిర్ణయం ఉంటుందని.. అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముద్రగడ జనసేనలో చేరడం ఖాయమని తేలుతోంది. మరోవైపు వైసిపి పరిశీలకుడు మిధున్ రెడ్డి ముద్రగడతో చర్చించడానికి సిద్ధమైనట్లు సమాచారం. కానీ వైసీపీ నేతలు ఎవరూ తన ఇంటికి రావద్దని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ముద్రగడకు వైసిపి రాజ్యసభ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. మరి ముద్రగడ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular