మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరినారాయణ అలియాస్ జగన్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. కొద్దిరోజులుగా కొవిడ్ తో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందినట్లు బస్తర్ జిల్లా అడవుల్లో ప్రచారం సాగుతోంది.
జగన్ మృతి వార్త వాస్తవమేనని దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ ధృవీకరించారు. బస్తర్ ఐజీ పి.సుందర్ రాజు కూడా నిజమేనని ప్రకటించారు. జగన్ మరణం వార్తపై మావోయిస్టు పార్టీ నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో నాలుగుసార్లు తప్పించుకున్న జగన్ ఈ సారి కూడా ఆ వార్తలో నిజం లేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన మరణ వార్తపై ఇంకా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
బస్తర్, దంతేవాడ అటవీ ప్రాంతాల్లోనే జగన్ చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసులు కూడా ప్రకటించారు. అయితే మావోయిస్టు పార్టీ నుంచి ఇంతవరకు ఎలాంటి ఖండన రాలేదు. దీంతో జగన్ చనిపోయింది వాస్తవమేనని పలువురు వాదిస్తున్నారు. సుక్మా అటవీ ప్రాంతంలో విషపూరితమైన ఆహారం తీసుకోవడం వల్ల జగన్ మరణించాడనే ప్రచారం సైతం జరుగుతోంది. మొత్తానికి జగన్ మరణం వార్త వాస్తవమేనని పోలీసులు తెలిపారు.
గెరిల్లా పోరాటాలు చేయటంలో జగన్ దిట్ట. పోలీసులకు వ్యతిరేకంగా వ్యూహాలు రచించడంలో జగన్ చాకచక్యంగా వ్యవహరించేవాడని తెలుస్తోంది. ఆయన ఆధ్వర్యంలో పలుమార్లు పోలీసులపై దాడులు సైతం జరిగినట్లు చెబుతున్నారు. పలుమార్లు జగన్ పోలీస్ ఎన్ కౌంటర్లలో కూడా తప్పించుకున్నట్లు సమాచారం. 37 ఏళ్ల జగన్ మావోయిస్టు ప్రస్థానంలో ఆయన ప్రయాణం ఆగిపోయినట్లే అని భావిస్తున్నారు.