పొరుగుదేశం మయన్మార్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఆందోళనకరం. నేటి ఆధునిక ప్రపంచంలోనూ ఆ దేశ సైన్యం.. ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు మనుగడలేకుండా అధికారాన్ని చేజిక్కించుకోవటం గర్హనీయం. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న సాకుతో మూడు నెలల క్రితం ఎన్నికైన ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నది. సైన్యాధిపతి మిన్ ఆంగ్ లయాంగ్ సర్వాధికారాలు చేజిక్కించుకుని దేశంలో ఆత్యయిక స్థితి విధించారు. విమానాశ్రయాలను మూసివేశారు. మయన్మార్ రాజధాని నేపిడా సహా దేశంలోని ప్రధాన నగరాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. టెలివిజన్ ప్రసారాలపై ఆంక్షలు విధించారు. అధికార నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) నేత ఆంగ్‌సాన్ సూకీతో పాటు, అధ్యక్షుడు విన్‌మింట్, ఇతర కీలక నేతలను నిర్బంధించారు. ఏడాదిపాటు ఎమర్జెన్సీ అమలుచేసి, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించి, అధికారం అప్పగిస్తామని మిలిటరీ ప్రకటించింది.
Also Read: మోడీ మళ్లీ పర్యటనల గోల.. ఈసారి ఎన్ని దేశాలో..?
బ్రిటిష్ వారి నుంచి విముక్తి పొందిన 1948 నాటి నుంచీ మయన్మార్‌లో ప్రజాస్వామ్యం పాదుకొనకుండా మిలిటరీ కండబలం చూపుతూనే ఉంది. 1962లో బర్మా స్వాతంత్య్రోద్యమనేత జనరల్ ఆంగ్‌సాన్‌పై తిరుగుబాటు చేసి, అతన్ని హతమార్చి అధికారం చేజిక్కించుకున్నది. తండ్రి హత్య జరిగినప్పుడు రెండేండ్ల చిన్నారి అయిన ఆంగ్‌సాన్ సూకీ తల్లి సంరక్షణలో విదేశాల్లో గడిపింది. 1988లో స్వదేశానికి తిరిగి వచ్చి ప్రజాస్వామిక ఉద్యమాలకు ప్రాణం పోసి సైనిక పాలనకు వ్యతిరేకంగా గళం విప్పింది. పౌర, ప్రజాస్వామిక హక్కుల కోసం సూకీ చేసిన శాంతియుత పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించింది. మొక్కవోని దీక్షకు గుర్తింపుగా 1991లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.
మయన్మార్‌లో ఐదు దశాబ్దాలుగా మిలిటరీ అన్నింటా ఆధిపత్యం చాటుతోంది. ప్రజాఉద్యమాలు పెల్లుబికినప్పుడల్లా ఎన్నికలను ఓ తంతుగా జరిపి పాలనాపగ్గాలు తమ చేతుల్లో ఉండే విధంగా వ్యవహరిస్తోంది. మిలిటరీ తీరుకు నిరసనగా సూకీ నేతృత్వంలోని ఎన్‌ఎల్‌డీ 2010నాటి ఎన్నికలను బహిష్కరించింది. అప్పుడు మిలిటరీ చెప్పుచేతల్లోని యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ (యూఎస్‌డీపీ) అధికారం చేపట్టింది. ఆ తర్వాత 2015లో సూకీ పార్టీ ఎన్నికల్లో గెలిచినా అధికారం అప్పగించేందుకు మిలిటరీ సిద్ధపడలేదు. స్టేట్ కౌన్సిలర్‌గా పాలన సాగించటానికే అంగీకరించింది. తాజాగా.. గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సూకీని అధికారం చేపట్టకుండా అడ్డగించింది. మయన్మార్ మిలిటరీ అరాచకాన్ని అమెరికా సహా యూరోపియన్ దేశాలన్నీ ఖండించాయి. ఐక్యరాజ్యసమితి కూడా తీవ్రంగా గర్హించింది. మయన్మార్‌లో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ప్రపంచ దేశాలు ఒత్తిడి తేవాలి. అక్కడి ప్రజాస్వామ్య శక్తులకు సంఘీభావం తెలపాలి.
ప్రస్తుత మయన్మార్ రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. సైన్యానికి విశేషాధికారాలున్నాయి. అందుకే సైనిక నిర్బంధం నుంచి విడుదలై అధికారం చేపట్టిన ఆంగ్ సాన్ సూకీ.. ఆది నుంచీ సైన్యంతో స్నేహపూరితంగానే వ్యవహరిస్తూ వచ్చారు. రోహింగ్యాలపై మయన్మార్ సైనిక దాడులను అంతర్జాతీయ సమాజం ఖండిస్తే.. సూకీ మాత్రం వారిని వెనకేసుకొచ్చారు. అంతర్జాతీయంగా తన ప్రతిష్టకు మచ్చ వస్తున్నా సూకీ సైన్యంతో స్నేహంగానే మెలిగారు.
Also Read: సోనియాగాంధీ ఫెయిల్ అయ్యేది అక్కడే?
ఎన్నికల్లో సూకీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) హౌస్ ఆఫ్ నేషనాలిటీస్‌లో 138 సీట్లు సాధించింది. ప్రతినిధుల సభలో 258 సీట్లు గెలుచుకుంది. సైన్యం మద్దతిస్తున్న యూనియన్ సాలిడారిటీ డెవలప్‌మెంట్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. రెండు సభల్లో వరుసగా కేవలం 7,26 సీట్లు మాత్రమే సంపాదించింది. అప్పట్నుంచి రాజ్యాంగ సవరణలపై సూకీ బందం ఆలోచించడం మొదలు పెట్టింది. ఈ చర్యలను సైన్యం వ్యతిరేకిస్తూ వస్తోంది. కొత్త పార్లమెంట్ సమావేశమై నిర్ణయాలు తీసుకోకుండా తిరుగుబాటు ద్వారా సూకీకి, రాజ్యాంగ సవరణలకు సైన్యం కళ్లెం వేసింది.
ఇదిలా ఉండగా.. సైనికాధినేత మిన్ ఆంగ్ లయాంగ్ చాలాకాలంగా దేశ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. దీనికి పార్లమెంట్‌లో మెజార్టీ సభ్యుల ఆమోదం కావాల్సి ఉంది. మయన్మార్ రాజ్యాంగం ప్రకారం.. పార్లమెంటులో 25 శాతం సీట్లు మిలిటరీ చేతిలో ఉంటాయి. రాజ్యాంగాన్ని తమ ఆమోదం లేకుండా సవరించుకోకుండా ఉండేలా ఈ ఏర్పాటు చేసుకున్నారు. కానీ.. ఈ సారి ఎన్నికల్లో తమ కనుసన్నల్లో నడిచే యూఎన్‌డీపీ సీట్ల సంఖ్య దారుణంగా పడిపోవడంతో స్వయంగా 25 శాతం సీట్లున్నా కూడా సైన్యం తన మాట చెల్లించుకోలేకపోవచ్చు. అంటే.. సైనికాధినేత లయాంగ్ అధ్యక్షుడయ్యే అవకాశాలు చాలా తక్కువ. రాజ్యాంగబద్ధంగా ఆ పదవి దక్కే పరిస్థితులు లేకపోవడంతో పాత పద్ధతిలో సైనిక తిరుగుబాటుకు రంగం సిద్ధం చేశారు. అంతర్జాతీయంగా అన్ని దేశాలూ కరోనాతో పోరాటంలో మునిగితేలుతుండడం.. అమెరికా తన అంతరర్గత గొడవల్లో ఉండడం మయన్మార్ సైన్యానికి కలిసి వచ్చాయి.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు