PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గడిచిన ఐదేళ్లలో ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. 2019లో లోక్సభ ఎన్నికల పూర్తి అయిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. అయితే ఆ టైంలో కూడా ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానాలు చెప్పలేదు. విలేకర్లు ప్రశ్నలు అడిగినప్పుడు మోడీ అమిత్ షా వైపు చూశారే తప్ప..వారికి ఎలాంటి బదులు ఇవ్వలేదు. ఆ సమావేశంలో మీడియా ప్రతినిధుల ప్రశ్నలన్నిటికీ అమిత్ షానే జవాబు ఇచ్చారు. అయితే ఈ వ్యవహారం అప్పట్లో జాతీయస్థాయిలో పెద్ద చర్చకే దారి తీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సామాజిక మాధ్యమాల్లోనైతే నెగిటిన్లు విస్తృతంగా ట్రోలింగ్స్ ను కొనసాగించారు.
ఇక అక్కడ కట్ చేస్తే 2019 ఎన్నికలు తర్వాత పీఎం మోడీ మళ్లీ ఇప్పుడే మీడియా ముందుకు వచ్చారు. వరుసగా జాతీయ, ప్రాంతీయ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలలో విలేకర్ల ప్రశ్నల పరంపర చూస్తే..మొత్తం మోడికి అనుకూలమైన ప్రశ్నలనే ఎక్కువ అడుగుతున్నారు. ఇది ఒక రకంగా మోడీ పోల్ మేనేజ్మెంట్లో భాగమేననే ప్రచారం కూడా ఉంది. అయితే ఇదే ఇంటర్వ్యూలు మోడీకి ప్రతికూల వ్యవహారంగా మారిన అవకాశాలు కూడా కనిపించాయి. ఇన్నాళ్లు మీడియా ముందుకు రాని ఆయన పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మాత్రం తనకు అనుకూలమైన మీడియా సంస్థలకే ఇంటర్వ్యూలు ఇస్తున్నారనే విమర్శలూ పెరిగాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయిలో ఓ మీడియా సంస్థకి ఇటీవల మోడీ ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆ ఛానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్న ఆసక్తి రేపుతుంది.
2019 తర్వాత మీరెందుకు ప్రధానమంత్రి స్థాయిలో ఒక్క ప్రెస్ మీట్ ను కూడా పెట్టలేకపోయారో చెప్పాలని సదరు విలేకరి పీఎం మోడీని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మోడీ గమ్మత్తైన సమాధానం ఇవ్వడం విశేషం. భారత్ లో మీడియాకు న్యూట్రాలిటీ లేదని బదులిచ్చారు. ప్రెస్ మీట్ లు పెట్టి తాను ఒకటి చెప్తే మీడియా సంస్థలు దాన్ని చిలువలు పలువలు చేసి తన ఆలోచన విధానాన్నే మార్చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ఇండియాలోని మీడియా వ్యవస్థపై ఈ రకమైన కామెంట్స్ చేసిన ఆయన..ఇప్పుడు మీడియా సంస్థలకు వరస ఇంటర్వ్యూలు ఇవ్వడం.. అందులోనూ తనకు, బిజెపికి అనుకూలమైన ప్రశ్నలే ఎక్కువగా ఉండడంతో.. విమర్శకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. మోడీ ఈ వ్యాఖ్యలను బట్టి ఆయన ఆలోచన విధానం ఏంటనేది అర్థమవుతుందని చెబుతున్నారు. తన పరిపాలన కాలంలో ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే తమ ప్రభుత్వంలోని లొసుగులపై విలేకర్లు ఎక్కడ ప్రశ్నిస్తారోననే ఆయన మీడియాకు భయపడి మొఖం చాటేసినట్లు తెలుస్తుందనే భావనను వ్యక్తపరుస్తున్నారు.