
ఎప్పుడైతే కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణను చేస్తున్నట్లు ప్రకటించిందో అప్పటి నుంచి ఏపీలో ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తోంది. ప్లాంట్‌ను నడిపించాల్సిందేనంటూ నిరసనలు హోరెత్తుతున్నాయి. స్టీల్ ప్లాంట్‌తో రాష్ట్రానికి సంబంధం లేదు.. నూటికి నూరు శాతం ప్రైవేటీకరిస్తాం అంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో కార్మిక సంఘాలు ఆందోళనలు మొదలుపెట్టాయి. అంతేకాదు.. ఈ విషయంపై సీఎం జగన్ కూడా స్పందించారు. అఖిలపక్షం, కార్మిక సంఘాల నేతలతో ఢిల్లీ వస్తాను.. అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు.
స్టీల్ ప్లాంట్ విషయమై ఇప్పటివరకూ రాజకీయ పార్టీలు విడిగా పోరాటం చేస్తున్నాయే గానీ.. కలిసి పోరాడేందుకు ముందుకు రావడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మిగతా పార్టీల కంటే ఎక్కువగా ఏపీలో బీజేపీని ఇబ్బంది పెడుతోంది. అలాగే దాని మిత్రపక్షం జనసేన సైతం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని జనసేన చెబుతోంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇదివరకే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసొచ్చారు. కానీ.. కేంద్రం తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదు.
అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ గానీ, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ గానీ కేంద్రంపై విమర్శలకు దిగడానికి, స్టీల్ ప్లాంట్ కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్న సంకేతాలు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగానే ముందడుగేస్తే.. జనసేన అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్.. ఆ పొత్తు కోసం సర్దుకుపోతారా..? లేక విశాఖ వాసుల సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకొని పోరాడుతారా..? అనేది సందిగ్ధం నెలకొంది.
ఒకవేళ పవన్ కళ్యాణ్ గనుక స్టీల్ ప్లాంట్ ప్రైయివేటీకరణను వ్యతిరేకిస్తూ.. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. బలంగా పోరాటం చేస్తే జనంలో జనసేన పట్ల సానుకూలత ఏర్పడే అవకాశం ఉంది. గతంలో రాష్ట్ర విభజన సమయంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నారు. విభజనను వ్యతిరేకిస్తూ.. ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి.. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి పోరాటం చేసి ఉంటే.. ప్రజారాజ్యాన్ని విలీనం చేయడం ద్వారా చేసిన తప్పును దిద్దుకునేందుకు ఓ అవకాశం లభించి ఉండేది. కానీ.. చిరంజీవి రాష్ట్ర విభజనను వ్యతిరేకించినా మరో ముందడుగు వేయలేకపోయారు. ఫలితంగా ప్రజారాజ్యానికి మళ్లీ ప్రాణం పోసే అవకాశాన్ని కోల్పోయారు. కానీ.. పవన్ మాత్రం పాతికేళ్లు రాజకీయాల్లో ఉండటానికి వచ్చానని పదే పదే చెబుతున్నారు. కాబట్టి ఉక్కు ఉద్యమం రూపంలో ఆయన కోసం ఓ అవకాశం ఎదురు చూస్తున్నట్లే కనిపిస్తోంది. మరి ఈ అవకాశాన్ని పవన్ ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారా అనేది తెలియకుండా ఉంది.