
Pawan Kalyan: పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న మాటలు ఈ మధ్య చాలా సంచలనంగా మారుతున్నాయి. కొద్దిరోజులుగా పలు సమావేశాల్లో వపన్ కల్యాణ్ మాట్లాడుతున్న మాటలు.. కొందరి మనసుల్లో సరికొత్త ఆలోచనలు కలిగించాయా.. అనే అనుమానం వ్యక్తం అవుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో సంధించిన కుల కుల రాజకీయం బాణంపై చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల కాలంలో తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో లేవనెత్తిన కుల అంశంపై స్పందన గట్టిగానే వస్తోంది. అతడి శ్రమకు తగ్గ ఫలితం ఇచ్చినట్లే కనిపిస్తోంది. అయితే జగన్ ప్రభుత్వం పవన్ కల్యాణ్ కార్యక్రమాన్ని ఆ సమయంలో అడ్డుకోవడం పవన్ కు మరింత మైలేజీ పెంచిందనే చర్చ ఏపీలో సాగుతోంది.
ఏపీలో ఉన్న జనసేన కార్యకర్తలకు ఇబ్బంది కలిగిస్తే.. ఇతర పార్టీల కాపు నాయకులపై ఆ ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. కాపు గడప రాజమహేంద్రవరంలో 2024 ఎన్నికలే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ప్రారంభించిన పర్యటన ఇప్పుడు ఏపీలో కుల రాజకీయాల ప్రాధాన్యతను మరోసారి తెరపైకి తెచ్చింది. కులాలే టార్గెట్ గా పవన్ కల్యాణ్(Pawan Kalyan) వ్యాఖ్యలు ఉండడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇన్నాళ్లు కులాలు.. మతాలకు తాను అతీతమని ముందుకు సాగిన పవన్ కల్యాణ్ ప్రస్తుతం చేస్తున్న కుల రాజకీయంపై జోరుగా చర్చ సాగుతోంది. కాపు అనుబంధ వర్గాలు కొన్ని కీలకంగా వ్యవహరిస్తే.. మార్పు తప్పనిసరిగా వస్తుందని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో వేడి పుట్టిస్తున్నాయి. కాపులు ముందుకు రాకపోవడం వల్ల ఇప్పటి వరకు కలిగే నష్టాన్ని చెప్పే ప్రయత్నం చేసిన పవన్ కల్యాణ్.. 2009కి ముందు రాజకీయాల్లోకి వచ్చిన ఓ కీలక నాయకుడిని తాము ముఖ్యమంత్రిగా చేసుకోకపోవడంతోనే ప్రస్తుతం తమ వర్గం పరిస్థితి ఇలా తయారైందని అంటున్నారు. ఈ వ్యాఖ్యలు చాలా దుమారం రేపాయి.. అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
పవన్ కల్యాణ్ కులాలను రెచ్చగొడుతున్నాడనే ఆరోపణలు సైతం వచ్చాయి. దీంతో వెనక్కి తగ్గిన పవన్ స్టార్.. సొంతంగా వివరణ ఇచ్చుకునే పనిలో పడ్డారు. తాను కులాలను రెచ్చగొట్టడం లేదని చెబుతూనే.. రాజకీయ ప్రక్షాళన చేసే నాయకుడిగా చూడాలని చెప్పుకొస్తున్నారు. ఇటీవల ఏర్పాటుచేసిన తెలంగాణ జనసేక కార్యక్రమంలో ముందుగా జై తెలంగాణ నినాదంతో మాట్లాడడం మొదలు పెట్టిన పవన్ కల్యాణ్ తరువాత మొత్తం ఏపీ రాజకీయాల గురించే మాట్లాడారు. అక్కడ కూడా కులాల ప్రస్తావన తీసుకొచ్చిన ఆయన తాను సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. తనను ఓ సోషల్ డాక్టరుగా చూడాలని.. ఏపీలో ఓ కులాన్ని వర్గ శత్రువుగా చూడడంతో అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు. అయితే పవన్ కల్యాణ్ కుల రాజకీయాలపై జోరుగా చర్చ సాగుతుండగా.. అది ఎటువైపు వెళ్తుందోఅనే అనుమానం జనసైనికుల్లో వ్యక్తం అవుతోంది.