
‘‘త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరగబోతోంది.. అందులో పవన్ కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది..’’ ఇదీ.. కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న అంశం. మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా తదితరులు కొనసాగిస్తున్న వరుస భేటీలు కూడా మంత్రివర్గ విస్తరణ కోసమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, ఇందులో వాస్తవం ఎంత? ఒకవేళ జరిగినా.. పవన్ కు మంత్రి పదవి ఇవ్వడంలో నిజముందా? ఇస్తే.. పవన్ ఓకే అంటాడా? ఇంతకూ జనసేనాని మనసులో ఏముంది? అన్నది ఆసక్తికరంగా మారింది.
అందుతున్న సమాచారం ప్రకారం మంత్రివర్గ విస్తరణ ఖాయమనే అంటున్నారు. దీనికి పలు కారణాలు చూపిస్తున్నారు. 2014లో ఉన్న మోడీ వేవ్ ఇప్పుడు లేదనేది విశ్లేషకులు చెబుతున్న మాట. సహజ వ్యతిరేకతకు తోడు కరోనా వేళ జరిగిన ప్రచారం, వ్యవసాయ చట్టాల వంటివి బీజేపీ ప్రతిష్టను దెబ్బతీశాయని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. వచ్చే ఎన్నికలకు కష్టమవుతుందని భావించిన కాషాయ పెద్దలు.. ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారని అంటున్నారు.
ఇందులో భాగంగానే కేబినెట్ విస్తరణ అని అంటున్నారు. కరోనా వేళ సరిగా పనిచేయని మంత్రులతోపాటు ఆరోపణలు ఉన్నవారిని పక్కనపెట్టే ఛాన్స్ ఉందట. వీరి స్థానాలను భర్తీ చేయడంతోపాటు ఇతర శాఖలను కూడా తెరపైకి తెస్తారని చెబుతన్నారు. అయితే.. కొత్తగా వచ్చే మంత్రుల్లో బీజేపీకి చెందిన వారు ఉండరనేది వినిపిస్తున్న మాట. మిత్రపక్షాలకు ఈ పదవులు ఇవ్వబోతున్నారట. ఆ విధంగా మిత్రులను దగ్గర చేసుకొని ఎన్నికలకు వెళ్లాలనేది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు.
ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ పేరు తెరపైకి వచ్చింది. ఏపీలో జనసేన – బీజేపీ మిత్ర పక్షాలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పవన్ కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా.. ఏపీలో సానుకూల పరిస్థితులు డెవలప్ చేసుకోవచ్చని భావిస్తోందట. ఒకవేళ ఇది నిజమే అయితే.. పవన్ ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తికరం. ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా పవన్ తన బలం రాష్ట్రంలోనే పెంచుకోవాలని చూస్తాడు. అతని అంతిమ లక్ష్యం ముఖ్యమంత్రి అని చెప్పడంలో సందేహం లేదు. మరి, అలాంటి నేత కేంద్ర మంత్రి పదవిని తీసుకుంటాడా? అన్నది ప్రశ్న.
ఇదిలాఉంటే.. మరో చర్చ కూడా సాగుతోంది. జనసేన – బీజేపీ మధ్య పొత్తు చర్చల్లో పవన్ ఓ కండీషన్ పెట్టాడట. అటు టీడీపీతోగానీ, ఇటు వైసీపీతోగానీ బీజేపీ పొత్తు పెట్టుకోవద్దని, అలా అయితేనే.. తాను కలుస్తానని చెప్పాడట. ఈ విషయంలో అంగీకారం కుదిరిన తర్వాతే ఈ పొత్తు పొడిసిందని టాక్. కానీ.. రాష్ట్ర బీజేపీ నేతల్లో కొందరు జగన్ కు సన్నిహితంగా ఉంటున్నారనే ప్రచారం ఉంది. ఈ విషయమై పవన్ సీరియస్ గా ఉన్నాడట. ఆ మధ్య బీజేపీ తీరుపట్ల కినుక వహించడంలోనూ కారణం ఇదేనట. అందువల్ల.. తనకు ఏమైనా చేయాల్సి వస్తే.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నాడట. మరి, ఇందులో వాస్తం ఎంత? పవన్ కు కేంద్ర మంత్రి పదవి ఆఫర్లోనూ నిజం ఎంత అనేది తేలాలంటే విస్తరణ వరకు వేచి చూడాల్సిందే.