
వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ వంద స్థానాలు కూడా లేకుండా ఉండిపోయింది. దీనికి కారణం స్వయంకృతాపరాధమే. రాష్ర్టాల నాయకులను ఢిల్లీ నేతలు నిర్ణయిస్తే ఇలాగే ఉంటుంది మరి. ఇంకా పాఠాలు నేర్వడం లేదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే అదే సంప్రదాయాల్ని కొనసాగిస్తూ చేజేతులా పార్టీని నాశనం చేస్తున్నారు. లాబీయింగ్ కు అలవాటు పడి సొంత పార్టీ నేతల్నే పక్కన పెడుతున్నారు. ఫలితంగా వారే పార్టీని నట్టేట ముంచి అధికారం చెలాయిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి అస్సాం వరకు ఎందరో నేతల్ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో అధికారం సైతం దూరమైపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఒంటరిగా మిగిలిపోతోంది. దేశ రాజకీయాల్ని శాసించిన జాతీయ పార్టీ ప్రస్తుతం జవసత్వాలు లేని పార్టీగా రికార్డులు తిరగరాస్తోంది. ఇన్నాళ్లు వెలుగు వెలిగిన పార్టీ ప్రస్తుతం చీకట్టోనే మగ్గుతోంది. అయినా నేతల్లో స్పందన కలగడం లేదు.
పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కానీ ఆమెను నిలువరించడంతో ఆమె సొంత పార్టీ పెట్టుకుని మూడుసార్లు బెంగాల్ పీఠాన్ని అధిరోహించి తిరుగులేని నేతగా ఎదిగారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ను సైతం ఇదే కోవలో ఇబ్బంది పెట్టడంతో ఆయన సైతం సొంత పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ ఓటు బ్యాకుంను కొల్లగొట్టి అధికారం చేపట్టారు. అస్సాంలో హిమంత బిశ్వశర్మ సైతం ఇదే విధంగా పార్టీని విడిచి బీజేపీలో చేరి ముఖ్యమంత్రి అయిపోయారు.
ఢిల్లీలో ఉండి చక్రం తిప్పే వారు పోవాలి. రాష్ర్టాల పరిస్థితులు ఆకలింపు చేసుకుని ఇక్కడ సత్తా ఉన్న వారిని నియమించే పద్ధతి రావాలి. అప్పుడే రాజకీయాలు రంజుగా ఉంటాయి. ఢిల్లీ పెత్తనం సాగినంత కాలం కాంగ్రెస్ పార్టీ తీరు మారదు. ఓటమినే నమ్ముకోవాలి. విజయాలను మరచిపోవాలి. అధినేతల్లో మార్పు రావాలి. అందుకోసం రాజకీయంగా కసరత్తు చేయాలి. సొంత రాష్ర్టంలో పార్టీని నడిపే సత్తా ఉన్న వారిని గుర్తించి వారికే అధికారం అప్పగించేలా చర్యలు తీసుకోవాలి.
కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. అడకత్తెరలో ఇరుక్కున్న పోకచెక్కలా అయిపోయింది పరిస్థితి. ఎక్కడ కూడా సమర్థులైన వారు లేరు. నాయకత్వాన్ని పుణికిపుచ్చుకున్న వారంతా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఖాళీ దుకాణంలా కనిపిస్తోంది. పార్టీని విజయ తీరాలకు చేర్చాలంటే గట్టి నాయకత్వం రావాలి. మంచి పట్టుదల, దీక్షతో పార్టీని నడిపించే సత్తా ఉన్న వారిని గుర్తించి వారి చేతికే పగ్గాలు అప్పగించే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.