కృష్ణా బోర్డు తీరుపై జగన్ ఆక్రోషం వెళ్లగక్కారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై స్పందించకుండా ఏపీ ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. తెలంగాణతో కృష్ణ జలాల వివాదాల నేపథ్యంలో సీఎం జగన్ మరోసారి కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షేకావత్ కు లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ కృష్ణా నీరును వృథా చేస్తోందని ఆరోపించారు. కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) అనుమతి లేకుండా నాగార్జున సాగర్ లో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని.. కానీ ఆ ప్రాజెక్టులను పట్టించుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలనకు కృష్ణాబోర్డు సందర్శించాలనడంపై సీఎం జగన్ లేఖలో తీవ్ర అభ్యంతరం తెలిపారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను సందర్శించాకే తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించాలని సూచించారు.
అసలు కృష్ణా బోర్డు సూచనలను తెలంగాణ పదేపదే ఉల్లంఘిస్తోన్నా పట్టించుకోవడం లేదని జగన్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర వైఖరితో కృష్ణా జలాలు సముద్రంలో కలుస్తున్నాయని వాపోయారు.
శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తికే కట్టారని తెలంగాణ వాదిస్తోంది. నాటి ప్రాజెక్టు కట్టినప్పుడు నిబంధనలు చూపిస్తోంది. కానీ శ్రీశైలంలో 834 అడుగులు కన్నా తక్కువగా నీరు ఉంటే అది నిండటం అసాధ్యం. ఇక శ్రీశైలంలో 854 అడుగులు లేకుంటే పోతిరెడ్డిపాడు నుంచి గ్రావిటీ ద్వారా నీరును ఏపీ జిల్లాలకు తీసుకెళ్లడం అసాధ్యం. పోతిరెడ్డిపాడుపై ఆధారపడిన ప్రాజెక్టులకు జలాలు రావు. దీంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతాయి.
అందుకే జగన్ తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల్లోని నీటిని ఖాళీ చేయడంపై స్పందించింది. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖకు, కేఆర్ఎంబీకి ఫిర్యాదులు చేసినా చర్యలు లేవని వాపోయారు.
ఇక తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులను పట్టించుకోకుండా తెలంగాణ చేసే ఫిర్యాదులపై మాత్రం కేఆర్ఎంబీ వేగంగా స్పందిస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఫిర్యాదులను పట్టించుకోకుండా వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు.
నిజంగానే తెలంగాణ ఇలా విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రాజెక్టులు ఖాళీ చేస్తే వర్షాలు పడకుంటే శ్రీశైలంలో చుక్క నీరు మిగలదు.. మరో అవకాశం లేకనే సీమ ఎత్తిపోతలను చేపట్టామని జగన్ చెబుతున్నారు. అయితే తెలంగాణ కు కృష్ణా నీరుతో పెద్దగా ప్రయోజనం లేకపోవడం.. ఏపీ అంత వాడకం లేకపోవడం.. ఏపీకే ప్రయోజనం ఉండడంతో ఇలా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.