Komatireddy Raj Gopal Reddy: కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చాయి. కొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. అంతేకాదు మొన్నటిదాకా బిజెపి వైపు చూసిన నేతలు మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇవే కాకుండా మొన్న జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే జార్ఖండ్ లో తన కంపెనీకి 18 వేల కోట్ల టెండర్ దక్కినందుకు గాను పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని, బహిరంగ క్షమాపణ చెబితే పార్టీలోకి తిరిగి వచ్చే విషయం ఆలోచిస్తానని తన అనుచరులతో కోమటిరెడ్డి అన్నట్టు తెలిసింది.
ఉండాలా? వద్దా?
మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలనే విషయంపై రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజులుగా తన అనుచరులతో చర్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ చర్చల్లో ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఆయన కోరుకుంటున్నట్టు అనుచరులు చెబుతున్నారు.”కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత బిజెపి మరింత బలహీనంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ పుంజుకునే పరిస్థితి లేదు. ఈటల రాజేందర్ కు రాష్ట్ర బిజెపి నాయకత్వం అప్పగించినప్పటికీ మరో ఆరు నెలల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదని” రాజగోపాల్ రెడ్డి తన అనుచరులతో అన్నట్టు తెలిసింది. అయితే రాజగోపాల్ రెడ్డి అనుచరులు కాంగ్రెస్ పార్టీలోకి వెళితేనే బాగుంటుందని సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఎదిగే అవకాశాలు తక్కువని, అలాంటప్పుడు రాజకీయ జీవితాన్ని బలి పెట్టుకోవడం ఎందుకని ప్రశ్నించినట్టు తెలిసింది.
కాంగ్రెస్ క్రమంగా పుంజుకుంటున్నది
అయితే కాంగ్రెస్ పుంజుకుంటున్న కారణంగా వేరే పార్టీల వారు ఎవరూ భారతీయ జనతా పార్టీలో చేరబోరని రాజగోపాల్ రెడ్డి అనుచరులు అంటున్నారు. జాతీయస్థాయిలో ప్రధాని గ్రాస్ కూడా పడిపోతున్న నేపథ్యంలో 2024 లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 175 సీట్ల కంటే ఎక్కువ రావని రాజగోపాల్ రెడ్డి అనుచరులు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. వారి అభిప్రాయంతోనే రాజగోపాల్ రెడ్డి ఏకీభవించినట్టు ప్రచారం జరుగుతుంది. “గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లోనే భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి. మిగతా చోట్ల అంతగా ప్రభావం ఉండకపోవచ్చు. అయితే బిజెపి దయ దాక్షిణ్యాలతోనే తనకు టెండర్ దక్కిందనే ఆరోపణలను రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకోవాలి. బహిరంగ క్షమాపణ చెప్పాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై ఆలోచిస్తానని”రాజగోపాల్ రెడ్డి చెప్పడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నది.
ఈటల రాజేందర్ కూడా
మరోవైపు ఈటల రాజేందర్ కూడా భారతీయ జనతా పార్టీని వీడిపోతారని ప్రచారం జరుగుతున్నది. అయితే దీనిని ఆయన ఖండిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి కూడా భారతీయ జనతా పార్టీలోనే ఉంటారని ఆయన స్పష్టం చేస్తున్నారు.. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని కూలదోసే దమ్ము భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని ఈటెల చెబుతున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి గోబెల్స్ ప్రచారం సర్వసాధారణమని ఆయన స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తాను బిజెపి లోనే ఉంటానని చెబుతున్నారు. అనుచరులతో సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారు అని చెప్తే.. నా నియోజకవర్గంలో ఏం చేయాలో కూడా మీరే చెబుతారా అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. నిప్పు లేనిదే పొగరాదు అంటారు కదా.. ప్రస్తుతానికి అయితే పొగ వస్తోంది.. నిప్పు ఎప్పుడు బయటపడుతుందో వేచి చూడాల్సి ఉంది.