PM Modi- Parakala Prabhakar: దేశ ప్రధాని నరేంద్రమోదీ విశ్వగురువుగా కీర్తించబడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్‌వైపు చూసేలా నిలిపిన మోదీ.. ప్రపంచ శాంతి కోసం కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పేద, ఆపదలో ఉన్న దేశాలకు సాయం అందిస్తున్నారు. పాకిస్తాన్‌తో మినహా ప్రపంచంలోని అన్ని దేశాలో సత్సంబంధాలు, మిత్రుత్వం కోరుకుంటున్నారు. ఇంతటి ఉన్నత లక్ష్యం, గుర్తింపు ఉన్న మోదీకి స్వదేశంలో మాత్రం వ్యరేకత, వ్యతిరేకులు పెరుగుతున్నారు. మోదీ పాలనా విధానాలను తప్పుపట్టే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ జాబితాలో తాజాగా ఓ ఆర్థిక వేత్త చేరాడు. ఇంకా ఆశ్చర్యం ఏమింటంటే సదరు ఆర్థికవేత్త మోదీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి భర్త కావడం. మోదీపై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశాడు. 2024లో దేశంలో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే వినాశనం తప్పదని హెచ్చరించాడు ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్. ఆర్థిక వ్యవస్థ–ఇతర విషయాల్లో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం ’ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్ ఆన్ ఎ రిపబ్లిక్ ఇన్ క్రైసిస్’ ను ఈ నెల 14న ఆదివారం బెంగళూరు ఆవిష్కరించారు.
పుస్తకం నిండా దేశ ఆర్థిక, రాజకీయ అంశాలే..
ఈ పుస్తకాన్ని స్పీకింగ్ టైగర్ ప్రచురించినది. ఈ పుస్తకంలో దేశ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, ఇతర సమస్యలపై మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వరుస వ్యాసాలు ఉన్నాయి. ఈ పుస్తకం విడుదల సందర్భంగా పరకాల ప్రభాకర్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో అభివృద్ధిపై విజయం సాధించినా, తరువాత నుంచి బీజేపీ హిందుత్వ వాదాన్ని అనుసరిస్తుందని, లౌకికవాదాన్ని పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. 2024లో మోడీ ప్రభుత్వం మరోసారి అధికారం లోకి వస్తే.. కేవలం దేశ ఆర్థిక వ్యవస్థకే కాకుండా.. యావత్తు దేశానికే విపత్తు అని ఆందోళన వ్యక్తం చేశారు.
విభజనతో లాభం పొందాలని..
ప్రజల మధ్య విభజనతో లాభం పొందాలని మోదీ ప్రభుత్వం చూస్తోందని ప్రభాకర్ విమర్శించారు. తన పోరాటం హిందువులు–ముస్లింల మధ్య కాదని, పేదరికం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు కలిసి చేసే పోరాటమని ప్రభాకర్ తెలిపారు. బీజేపీ, మోదీ హిందుత్వం కోసం పాకులాడు తుంటే వారిని ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని ప్రభాకర్ పిలుపు నిచ్చారు. ప్రభుత్వాల లక్ష్యం విభజనలను తొలగించడం, సామరస్యాన్ని పెంపొందించడంగా ఉండాలని చెప్పారు.
తప్పుదోవలో దేశ ఆర్థిక వ్యవస్థ
మోదీ పాలన దేశ ఆర్థిక వ్యవస్థను తప్పుగా నిర్వహిస్తుందని విమర్శించారు. పెద్దనోట్ల రద్దు విషయంలో మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అర్థిక శాస్త్రంలో ప్రాథమిక శిక్షణ పొందిన ఏ ఆర్థిక వేత్తయినా.. ఇంత పెద్దస్థాయిలో, ఇంత తక్కువ నోటీసు సమయ వ్యవధిలో పెద్దనోట్ల రద్దుకు సిఫార్సు చేసి ఉండరని ప్రభాకర్ విమర్శించారు. నోట్ల రద్దు పెద్ద తప్పిదమని, తదనంతరం తీసుకున్న తప్పుడు విధానాలు ఈ తప్పిదాన్ని మరింతగా పెంచి సంక్షోభాన్ని, మరింత తీవ్రతరం చేశాయని ప్రభాకర్ విమర్శిం చారు.
అవి నిజమైన పురోగతి కాదు..
దేశంలో యాపిల్ షోరూమ్‌లు లేదా ఫాక్స్‌కాన్ ఉత్పత్తి చేసే ఫోన్లు నిజమైన ఆర్థిక పురోగతికి సూచికలు కావని ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన ఆక్స్‌ఫామ్ నివేదికలో భారత్‌లో పెరుగుతున్న అసమానతలు, సంపద కేంద్రీకరణను ఎత్తి చూపిన విషయాన్ని గుర్తు చేశారు. మోదీ పాలనలో ఈ ప్రక్రియ వేగవంత మైందని, అధిక సంఖ్యలో భారతీయులు పేదలుగా మారారని ప్రభాకర్ తెలిపారు.
కేంద్ర మంత్రికి ఇబ్బందే..
కేంద్రం విధానాలను తప్పుపట్టిన ప్రభాకర్ స్వయానా కేంద్ర ఆర్థిక మంత్రికి భర్త. ఆయన రాసిన పుస్తకం, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన అంశాలు కేంద్ర మంత్రికి ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. కేంద్రం ఆర్థిక విధానాలు తప్పు అంటున్నప్పుడు ఆయన భార్య, కేంద్ర ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ కూడా తప్పు చేసినట్లే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే ప్రభాకర్ కావాలని చేశారో, లేక ఆయన స్వీయ అనుభవంతో పుస్తకం రాశారో తెలియదు కానీ, ప్రస్తుతం మంత్రి భర్తగా ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం విపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లు అయింది. మరోవైపు దేశవ్యాప్తంగా చర్చకు దారితాశాయి. తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.