Delhi Liquor Scam- Kavitha: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతుంది. ఇందులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా.. అనేకమంది మద్యం వ్యాపారులుతోపాటు ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమిషనర్ పై కూడా ఈడీ కేసులు నమోదు చేసింది. తాజాగా ఈ దందాలో తెలంగాణ ముఖ్యమంత్రి తనయ, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి రెండు రోజుల క్రితం ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్లో నిక్కర్ దందాలో కవిత పాత్ర పై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందులో కవిత ప్రమేయం ఉందా లేదా అనేది విషయం పక్కన పెడితే.. రాజకీయం మాత్రం కచ్చితంగా ఉందని చెప్పవచ్చు.

-కేంద్రంతో సఖ్యతగా ఉండి ఉంటే..
టిఆర్ఎస్ పార్టీ అధికార బిజెపితో సఖ్యతగా ఉండి ఉంటే ఈ విషయం బయటకు వచ్చేది కాదు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పవచ్చు అంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు బిజెపితో సఖ్యతగా మెలిగిన తర్వాత లేదా ఆ పార్టీలో చేరిన తర్వాత విచారణలు ఆగిపోతున్నాయనీ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బిజెపి చెంత చేరగానే అవినీతిపరులు నీతివంతులుగా మారుతున్నారని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ కూడా ఫస్ట్ టైం లో కేంద్రంతో సఖ్యతగా ఉన్నట్లు ఉండి ఉన్నా.. లేదా బిజెపి ఇంతగా బలం పొందలేకపోయినా.. ఈ వ్యవహారంలో కవిత పేరు బయటకు వచ్చేది కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Amaravati: అమరావతిపై జగన్ ప్రభుత్వం మరో ట్విస్ట్
-టిఆర్ఎస్ అవసరం లేదని భావించాకే..
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో టిఆర్ఎస్ అవసరం ఉండదని బీజేపీ ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు టిఆర్ఎస్ అధినేత., తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు కూడా కేంద్రంతో కయ్యానికి కాలుదవుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఇంతలా బలపడుతుందని ఊహించని కేసీఆర్.. ఎన్నికల్లో తనకు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని భావించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీన పరుస్తూ వచ్చారు. ప్రతిపక్షం బలహీనపడుతుండడం రాష్ట్రంలో బీజేపీకి కలిసి వచ్చింది.. పరోక్షంగా కేసీఆర్ బిజెపి బలపడేలా చేశారు అన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా హుజురాబాద్ ఎన్నికల తర్వాత కెసిఆర్ బిజెపి తమకు ప్రత్యర్థిగా మారుతుందని గుర్తించారు. ఈ క్రమంలోని ఏడాదిగా కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆ పార్టీ రాష్ట్ర నాయకుల సహకారంతో కేసిఆర్, తెలంగాణ సర్కార్ పై ఎదురు దాడి చేస్తోంది.
-ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా..
తెలంగాణలో బండి సంజయ్ బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ దూకుడు పెంచింది. ఈ సమయంలో కేంద్రంతో కేసీఆర్ కు ఏర్పడిన దూరం బండి సంజయ్ కి కలిసి వచ్చింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులతో బండి సంజయ్ రాష్ట్రంలో గతంలో ఆ పార్టీ అధ్యక్షుల్లా కాకుండా దూకుడుగా వ్యవహరిస్తున్నారు అన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ దూకుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి దోహదపడింది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో నాలుగు సీట్లు ఉన్న బీజేపీని 47 సీట్ల వరకు తీసుకెళ్లింది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ విజయానికి దోహద పడింది. త్వరలో రాబోయే మునుగోడు ఎన్నికల్లో కూడా లాభం చేకూరుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని, కుటుంబ పాలనను, ఎన్నికల సమయంలో ఈ ప్రజలకు హామీలను విస్మరించిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకతను మరింత పెంచాలని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. పశ్చిమబెంగాల్ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ ఇలాగే వ్యవహరించింది. మమతా బెనర్జీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని, కుటుంబ పాలన సాగిస్తోందని విస్తృతంగా ప్రచారం చేసి. మమత సర్కారుతో ఢీ అంటే ఢీ అన్నట్లుగానే వ్యవహరించింది. ఫలితంగా అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలను నుంచి 92 స్థానాలకు ఎదిగింది. తెలంగాణలో కూడా ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా పార్టీ బలపడుతుందని భావిస్తుంది.

–ఆధారాలతో సంబంధం లేకుండా..
ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కూతురు కవితను టార్గెట్ చేసినట్లు భావిస్తున్నారు. రాజకీయ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు కూడా అవసరం లేదు. ఈ క్రమంలోని బీజేపీ నాయకులు ఢిల్లీ వేదికగా కవితపై ఆరోపణలు సంధించారు. ఈ స్కాంలో ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్ కేంద్రం అసమర్థతను. తెలంగాణపై చూపుతున్న వివక్షతను.. ఎండ కొడుతున్న నేపథ్యంలో ఆయన కూతురైన తనపై బీజేపీ సత్య ఆరోపణలు చేస్తుందని కవిత పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా కేసీఆర్ మాట్లాడకుండా చేయాలని కుట్రపన్నారని విమర్శించారు. ఏ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. బీజేపీ ఆరోపణలతో తన ప్రతిష్టకు భంగం కలిగిందని కూడా కోర్టును ఆశ్రయించారు. కోటి రూపాయల పరిహారం చెల్లించాలని పరువునష్టం దావా వేశారు.
–కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలని..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని రోజులుగా కేంద్రంతో గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నారు. ఎక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటుచేసినా.. సభలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణపై కేంద్రం చెబుతున్న వివక్షతను ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే ‘ మోడీ నువ్వు గొకకున్నా.. నిన్ను గోకుతా ‘ అని వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని రోజులుగా కేసీఆర్ చేస్తున్న ఆరోపణలు వాడుతున్న పద ప్రయోగం.. భాషను గమనిస్తూ వస్తున్న మోడీ.. ఏమి చేయడం లేదన్నట్లు ఉంటూనే.. టిఆర్ఎస్ టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్లుగా కెసిఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పాత్రను తెరమీదికి తెచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తనతో పెట్టుకుంటే ఇంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు అన్న సంకేతాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తనను ఎదురించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సన్నిహితుడు, అఖిలేష్ యాదవ్ సన్నిహితులు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ రాహుల్ గాంధీ లను మోడీ టార్గెట్ చేశారు. ఇలా చేయడం ద్వారా ఆ పార్టీలోని మిగతావారు కూడా భయపడతారని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పుడు తోకజాడిస్తున్న కేసీఆర్ కూతురు కవితను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అలా కాకుండా ఇది నిజంగా అవినీతిపై యుద్ధమే అయితే అందరూ అవెందించాల్సిన విషయమే. కానీ ప్రస్తుతానికి ఇందులో రాజకీయమే ఎక్కువగా కనిపిస్తోంది.
Also Read:Amit Shah- TDP: టీడీపీ ఆశలను నీరుగార్చిన అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ తరువాత మారిన సీన్

