Amaravati: అమరావతి రాజధాని విషయంలో గత కొద్దిరోజులుగా స్తబ్ధత నెలకొంది. అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకుగాను కోర్టు ఆరు నెలల వ్యవధి కూడా ఇచ్చింది. కానీ అమరావతిలో ఎటువంటి అభివృద్ది పనులు చేయడం లేదు. అటు కోర్టు ఇచ్చిన గడువు మాత్రం సమీపిస్తోంది. కోర్టు ఆదేశాలున్నా ఇద్దరు, ముగ్గురు మంత్రులు, వైసీపీ కీలక నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులను కట్టి తీరుతామని కూడా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అయితే హైకోర్టు గడువు సమీపిస్తుండడంతో ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. కోర్టు ఆదేశించిన ఆరు నెలలు కాకుండా.. గడువు పెంచాలని పిటీషన్ దాఖలు చేసింది. వాస్తవానికి హైకోర్టు తీర్పుపై వైసీపీ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతూ వచ్చింది. న్యాయపరంగా ఎలాంటి ముందడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని విచారణ మరోసారి కోర్టు ముందుకు వచ్చింది. దీంతో అమరావతిలో మీరు ఆదేశాలిచ్చినట్టు ఎటువంటి అభివృద్ధి జరగడం లేదని రైతుల తరుపున వాదిస్తున్న న్యాయవాది కోర్టు ముందుంచారు. ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై అడ్వకేట్ జనరల్ స్పందించారు. అమరావతిపై ముందుకెళ్లేందుకు ప్రభుత్వం అన్నివిధాలా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అదే కోర్టులో రివ్యూకు వెళ్లాలా? లేకుంటే సుప్రీం కోర్టును ఆశ్రయించాలో పరిశీలన చేస్తోందని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుపైన రివ్యూకు దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించినట్టు ఏజే ధర్మాసం ఎదుట వాదనలు వినిపించారు.

ఐదేళ్లు పెంచాలని కోరుతున్న ప్రభుత్వం
అయితే హైకోర్టు విచారణ సమయంలో అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించి గడువు ప్రస్తావనకు వచ్చింది. గడువును ఆరు నెలల నుంచి ఐదేళ్లకు పెంచాలని కోరుతూ అనుబంధ పిటీషన్ వేసిన విషయాన్ని అడ్వకేట్ జనరల్ ప్రస్తావించారు. మరోవైపు అమరావతి రైతులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చినా రాజధాని నిర్మాణంలో ఎటువంటి పురోగతి లేదని రైతుల తరుపున న్యాయవాదులు ప్రస్తావించారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు పింఛన్లు కూడా అందడం లేదన్నారు. ఏజే కోర్టుకు నివేదించిన అంశాలు, సుప్రీం కోర్టులో ఎస్ఎల్బీ నమోదైన నేపథ్యంలో ఈ విషయంలో కొద్దిరోజులు వేచి ఉండడమే ఉత్తమమని ధర్మాసనం అభిప్రాయపడింది. విచారణను అక్టోబరు 17కు వాయిదా వేసింది.
Also Read: Amit Shah- TDP: టీడీపీ ఆశలను నీరుగార్చిన అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ తరువాత మారిన సీన్

12నుంచి పాదయాత్ర..
వాస్తవానికి అమరావతి రాజధాని విషయంలో వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఒకే విధానంతో ముందుకెళుతున్నాయి. కానీ ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పడంతో మరోసారి తేనె తుట్టను కదిపినట్టు అయ్యింది. దీంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి రాజకీయ పక్షాలు సన్నద్ధమవుతున్నారు. సెప్టెంబరు 12 నుంచి అమరావతి రైతులు పాదయాత్రకు సన్నద్ధమవుతున్నారు. అమరావతి నుంచి అరసవల్లి వరకూ వినూత్న రీతిలో పాదయాత్ర చేయాలని తలపోస్తున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాదయాత్రకు జనసేన మద్దతు ప్రకటించింది. మిగతా రాజకీయ పక్షాలు సైతం సానుకూలంగా ఉన్నాయి. దీంతో ఉద్యమం మరింత తీవ్రమయ్యే అవకాశముంది.
Also Read:Bollywood Hope Liger Movie: అమీర్, అక్షయ్ ముంచేశారు… బాలీవుడ్ ఆశలన్నీ విజయ్ ‘లైగర్’ పైనే!


[…] […]