Jagan Amaravati: ఏపీ సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. విషయం లేనిదే ఆయన ఏమీ మాట్లాడరు. ఇప్పుడు సడన్ గా అమరావతిపై తన కరుణ చూపారు. ఎప్పుడూ లేనివిధంగా అమరావతికి జై కొట్టారు. అమరావతి అందరిదని నినదించారు. అయితే ఈ మాటలు వెనుక అసలు విషయం ఏంటన్నది తెలియాల్సి ఉంది. రాజకీయ ఎత్తుగడ అని విపక్షాలు అనుమానిస్తున్నాయి.
అమరావతి ఆర్5 జోన్లో 50,000 మంది పేదలకు ఇళ్ల పట్టాల అందించిన సంగతి తెలిసిందే. అమరావతి రైతులు అభ్యంతరం వ్యక్తం చేసినా జగన్ సర్కార్ మొండిగా ముందుకెళ్లింది. అమరావతిలో ఇతర ప్రాంతాలకు చెందిన నిరుపేద పేదలకు పట్టాలు ఇచ్చింది. దీనికి కోర్టు సైతం ఆమోదముద్ర వేయడంతో రెట్టింపు ఉత్సాహంతో జగన్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కాస్తా అనుమానాలకు దారి తీశాయి.
అమరావతి అందరిదిగా జగన్ చెప్పుకొచ్చారు. అయితే ఇన్నాళ్లకు ఆయన ఈ మాట ఒప్పుకోవడం విచిత్రంగా ఉంది. గత మూడేళ్లుగా విపక్షాలు అమరావతి రైతులు ఇదే మాట చెప్పుకొచ్చారు. కానీ జగన్ సర్కార్ వినిపించుకోలేదు. ఇప్పుడు జగనే స్వయంగా చెబుతుండడంతో కాస్త విచిత్రంగానే ఉంది. ఇందులో రాజకీయ లబ్ది స్పష్టంగా కనిపిస్తోంది.
రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ భారత్ చిత్రపటంలో నిలిచింది. ఇది ముమ్మాటికి జగన్ సర్కార్ తప్పిదమే. మరోవైపు మూడు రాజధానుల అంశం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఎన్నికలకు చూస్తే పట్టుమని పది నెలలు కూడా లేదు. ఈ సమయంలో రాజధాని అంశం జగన్ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారంలో కూడా విపరీతమైన ప్రభావం చూపే అంశం కానుంది. అందుకే జగన్ వ్యూహాత్మకంగా అమరావతి అందరిదని నినదించారు. కొంతవరకు ఈ అపవాదును దూరం చేసుకునే ప్రయత్నం చేశారు.