CM Jagan: పులివెందుల విషయంలో జగన్ భయపడుతున్నారా? అభద్రతాభావంతో ఉన్నారా? ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, వివేకా హత్య తదితర పరిణామాలతో ఆందోళనతో ఉన్నారా? అందుకే రాజకీయ ప్రత్యర్థి బీటెక్ రవిని అరెస్టు చేశారా? రాష్ట్రంలో ఎక్కడా లేని మినహాయింపులు పులివెందులకు ఇస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
రెండు రోజులుగా పులివెందుల విషయంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పుడో పాత కేసులను సాకుగా చూపి టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవిని పోలీసులు అరెస్టు చేశారు. కనీసం ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నామో చెప్పకుండానే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే లోకేష్ కడప జిల్లాకు వచ్చినప్పుడు.. ఎయిర్ పోర్ట్ లో జరిగిన తోపులాట కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఒక్క కేసే కాదు.. బీటెక్ రవి చాలా రకాల కేసులు నమోదు చేయడానికి పోలీసులు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని డిసైడ్ అయ్యింది. రాజకీయ ప్రత్యర్థి లేకుండా చూసేందుకేనని.. రాజకీయ పునాదులు కదులుతుండడంతోనే బీటెక్ రవిని అరెస్టు చేశారని.. మూడేళ్లు బయటకు రాకుండా జైల్లో గడిపేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ స్థలాల పంపిణీ విషయంలో సైతం పులివెందుల నియోజకవర్గాన్ని మినహాయిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడం విశేషం. నగరాలు, పట్టణాలు, మేజర్ పంచాయతీలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పంపిణీ చేయకూడదన్న నిబంధన ఉంది. దీని నుంచి పులివెందుల మండలాన్ని మినహాయింపు ఇస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. పులివెందుల పురపాలక సంఘం పరిధిలోని మూడు గ్రామాల్లో 1100 ఎకరాల భూములను 1100 మందికి ఎకరా చొప్పున అందించేందుకు ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జిల్లా,మండల కేంద్రాలకు, పట్టణాలు, మేజర్ పంచాయతీలకు ఐదు కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ స్థలాల పంపిణీ పై 2012లో నిషేధం విధించారు. కానీ ఆ నిషేధాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ప్రత్యేక జీవో జారీ చేసి మరి భూమి కట్టబెట్టేందుకు సిద్ధపడుతుండడం విశేషం.
వివేకానంద రెడ్డి హత్య తర్వాత కడప జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. నిందితులను కొమ్ముకాస్తున్నారన్న అపవాదు సీఎం జగన్ పై పడింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అటు బీటెక్ రవి సైతం పులివెందుల నియోజకవర్గంలో దూకుడు పెంచారు. పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేశారు. పార్టీ కార్యాలయాలను ప్రారంభించి చాప కింద నీరులా విస్తరిస్తున్నారు. ఇది జీర్ణించుకోలేని సీఎం జగన్ ఆయనను అక్రమంగా అరెస్టు చేయించారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. జగన్ ఎందుకో భయపడుతున్నారని అనుమానిస్తోంది. ఈ తరుణంలో భూ పంపిణీ విషయంలో ప్రత్యేక జీవో జారీ చేయడం కూడా అనుమానాలకు నిజం చేస్తోంది. ఇదంతా సీఎం జగన్ పులివెందుల నియోజకవర్గం విషయంలో అభద్రతాభావంతో ఉండడం వల్లే చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైసీపీ నేతలు మాత్రం వీటిని కొట్టిపారేస్తున్నారు. పులివెందుల జగన్ కు పెట్టని కోట అని..భయం అనేది ఆయన బ్లడ్ లో లేదని తేల్చి పారేస్తున్నారు.