DGP Gautam Sawang: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో డీజీపీ గౌతం సవాంగ్ బదిలీ వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో అందరి నోట ఇదే మాట వినిపిస్తోంది. ప్రభుత్వం ఇన్నాళ్లు ఆయన సేవలు వినియోగించుకుని ఇప్పుడు కూరలో కరివేపాకులాగా తీసేశారని వాదనలు వస్తున్నాయి. అర్థంతరంగా ఆయనను ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాలు కూడా పెదవి విరుస్తున్నాయి. డీజీపీపై సహజంగా కోపం ఉన్నా ప్రభుత్వ నిర్వాకంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గతంలో సీఎస్ గా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యంను కూడా ఇదే తీరుగా బదిలీ చేశారని ప్రస్తుతం గౌతం సవాంగ్ వంతు వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. సీఎం జగన్ స్వార్థపూరితంగా ఆలోచిస్తూ ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని తెలుస్తోంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధితో పని చేసినా చివరకు వారిని బదిలీలు చేస్తూ తన పంతం నెరవేర్చుకుంటున్నారని చెబుతున్నారు.
అయితే గౌతం సవాంగ్ కు ఏపీపీఎస్పీ చైర్మన్ పదవి ఇచ్చేందుకు ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాల తీరుపై వైసీపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. ఉద్యోగుల బదిలీ సహజమేనని దీనికి ప్రతిపక్షాలు ఎందుకు స్పందిస్తున్నాయో అర్థం కావడం లేదని ప్రతి దాడి చేస్తున్నారు. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందని చెబుతున్నారు.
Also Read: CM Jagan- Gowtham Sawang: గౌతమ్ సవాంగ్‌కు కీలక పదవి.. జగన్ అసలు వ్యూహం ఇదే..!
జగన్ ఎప్పుడైనా తన మదిలో అనుకుంటే చేసేస్తారు. ఎవరి గురించి పట్టించుకోరు. ఇందులో భాగంగానే గౌతం సవాంగ్ బదిలీ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే డీజీపీ బదిలీ కూడా జగన్ ఆలోచనే అని తెలుస్తోంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాయని అంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా గౌతం సవాంగ్ బదిలీపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తుండటంతో వ్యవహారం ఎందాకా వెళ్తుందో తెలియడం లేదు.
మరోవైపు గౌతం సవాంగ్ పై అనేక ఆరోపణలున్నాయి. ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ టీడీపీ నేతలు సవాంగ్ తీరుపై బహిరంగంగానే విమర్శలకు దిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో గౌతం సవాంగ్ బదిలీ విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు.
Also Read: CM Jagan: సవాళ్లు విసిరిన వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుంటున్న జగన్.. మిగిలింది అదొక్కటే..!