ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణపై అందరిలో అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి. సామాజిక వర్గాలు, పనితీరు, ఇపుడున్న వారిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రక్షాళన భారీగానే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడున్న 25 మంది మంత్రుల్లో దాదాపు 90 శాతం మందిని తొలగిస్తారనే వాదన వెలువడుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవులు ఆశించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. కానీ జగన్ మదిలో మాత్రం ఏముందో ఎవరికి అంతుబట్టడం లేదు. మొదటి మంత్రి వర్గ విస్తరణ సమయంలో కూడా ఇలాగే ఎవరికి అర్థంకాని విధంగా మంత్రివర్గాన్ని విస్తరించి అందరిని ఆశ్చర్యపరిచారు.
ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న వారిలో ఎక్కువ మందిని మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రుల పనితీరుపైనే వారి మనుగడ ఆధారపడి ఉంటుందని సమాచారం. మొత్తానికి భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న వారిలో దాదాపు 23 మందిని మార్చాలని చూస్తున్నట్లు సమాచారం. ఇద్దరు మంత్రులు సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన గోపాలకృష్ణ మాత్రం రాజ్యసభ ఎంపీలుగా వెళ్లిపోగా మోపిదేవి వెంకటరమణ, సుభాష్ చంద్రబోస్ లకు బాధ్యతలు అప్పగించారు.
సామాజిక వర్గాల ప్రాతిపదికగా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే సీనియర్ నేత రోజాకు మంత్రి పదవి దక్కడం లేదు. ఇన్నాళ్లు ఎదురు చూస్తున్నా ఆమె కోరిక నెరవేరడం లేదు. పదవుల ఎంపికలో బీసీలకే ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో పోస్టులు రెడ్లకు దక్కకుండా పోతున్నాయనే వాదన వినిపిస్తోంది. అయినా ముఖ్యమైన పదవుల్లో మాత్రం రెడ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం.
మొత్తానికి వచ్చే విజయదశమి సందర్భంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు దక్కలేదనే అసంతృప్తితో ఉన్న వారితో షాకులు తప్పేట్లు లేవు. కానీ మంత్రివర్గ విస్తరణపై జగన్ కు మాత్రం ఇప్పటికే ఓ క్లారిటీ ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. ఎవరికి పదవులు ఇవ్వాలో ఎవరిని కట్ చేయాలో ఇప్పటికే నివేదికలు తెప్పించుకుని సమీక్ష చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా మంత్రి వర్గ విస్తరణ జగన్ కు విషమ పరీక్షగానే మారనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.