
బీజేపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు పొసగడం లేదు. అధికారికంగా పొత్తు కొనసాగుతున్న అనధికారికంగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఏడాదిన్నర క్రితం ఢిల్లీ వేదికగా కలిసి ప్రయాణం చేయాలని రెండు పార్టీలు నిర్ణయించినా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. అమరావతిలో రెండు పార్టీలు ముఖ్య నేతలతో ఉమ్మడి ఎజెండా ప్రకటించాయి. కానీ అది అమలు కావడం లేదు. దీంతో తిరుపతిలో మినహా ఎక్కడ కూడా కలిసి నడిచిన దాఖలాలు కనిపించడం లేదు.
జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నాయకులు పవన్ కల్యాణ్ పోటీ చేయొద్దని ఆయన ఇంటికి వెళ్లి కోరడంతో ఆయన పోటీ నుంచి విరమించుకున్నారు. దీంతో అప్పటికే సిద్ధం చేసుకున్న జాబితాను ఉపసంహరించుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో ఎక్కడ కూడా బీజేపీ-జనసేన కలిసి నడిచిన దాఖాలు కనిపించలేదు. ఒక్క తిరుపతి ఎన్నికలో మాత్రమే ప్రచారం చేసినా అక్కడ అభ్యర్థి గెలుపు అందుకోలేకపోయారు.
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం బీజేపీ అభ్యర్థికి కాకుండా పీవీ నర్సింహారావు కుమార్తెకు జనసేన మద్దతు ప్రకటించడం తెలిసిందే. ఇవన్నీ చూస్తుంటే రెండు పార్టీల్లో అభిప్రాయ భేదాలు స్పష్టంగా కనిపిస్తోంది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి నడిచినా పెద్దగా ప్రభావం కనిపించలేదు. పవన్ ఎక్కువగా సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే వాదన ఉంది. మిత్రపక్షంగా ఉన్నా జనసేన బీజేపీతో కలిసి నిరసనలో పాల్గొన్న దాఖలాలు కూడా లేవని తెలుస్తోంది.
ఏపీలో ఎలాగు ప్రభావం చూపలేకపోతున్న నేపథ్యంలో తెలంగాణలోనైనా తన గుర్తింపు చూపించుకోవాలని జనసేన తాపత్రయ పడుతోంది హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకువేచి చూసి నిర్ణయం తీసుకోవాలని ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం రెండు పార్టీల్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.