CM Jagan: రాష్ట్ర ప్రయోజనాలపై జగన్ రాజీ పడుతున్నారా?

సీఎం జగన్ రాష్ట్ర అధికారులతో అత్యున్నత సమావేశం నిర్వహించారు. మరోసారి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడానికి నిర్ణయించారు. అయితే దీనిని ఎక్కువ మంది తప్పుపడుతున్నారు.

Written By: Dharma, Updated On : October 10, 2023 2:30 pm

Jagan

Follow us on

CM Jagan: కృష్ణా జలాల వ్యవహారంలో జగన్ సర్కార్ వైఖరి విమర్శల పాలవుతోంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. కృష్ణా జలాల పంపిణీ విషయంలో పున సమీక్షకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పునః సమీక్ష కోసం చాలా సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ వస్తుంది. అయితే తాజాగా తెలంగాణకు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో… పున సమీక్ష బాధ్యతను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కానీ సీఎం జగన్ మాత్రం కేంద్రానికి లేఖలతో సరిపెడుతున్నారు. అటు కేంద్రం, ఇటు తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడుతున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు.

సీఎం జగన్ రాష్ట్ర అధికారులతో అత్యున్నత సమావేశం నిర్వహించారు. మరోసారి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడానికి నిర్ణయించారు. అయితే దీనిని ఎక్కువ మంది తప్పుపడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు గండి పడినప్పుడు నేరుగా రంగంలోకి దిగాల్సింది పోయి.. తూతూ మంత్రంగా ఈ లేఖలు రాయడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇది విపక్షాలకు అస్త్రంగా మారుతుంది. వాస్తవానికి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత.. విభజన అంశాల్లో పొందుపరిచిన తర్వాత.. ఇలా పున సమీక్ష నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసేందుకు అవకాశం ఉంది. కానీ కేంద్రంతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా జగన్ సర్కార్ అంతటి సాహసం చేయలేకపోతుందని ప్రచారం జరుగుతుంది.

రాష్ట్ర విభజన తర్వాత విభజన అంశాల్లో స్పష్టంగా పొందుపరిచారు. నదీ జలాల వినియోగం పై స్పష్టతనిచ్చారు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ ప్రయోజనాల కోసం.. నదీ జలాల పంపకం విషయంలో పున సమీక్ష జరుపుతామని చెప్తుండడం ఏపీకి అన్యాయం చేసినట్లే. విభజనకు సంబంధించి చాలా వరకు హామీలు ఏపీ విషయంలో అమలు కావడం లేదు. అటు తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు సైతం విడుదల కావడం లేదు. కానీ దీనిపై కేంద్రం కఠిన నిర్ణయాలకు దిగడం లేదు. మరోవైపు తెలంగాణ సర్కార్ తో ఏపీ ప్రభుత్వానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటు కెసిఆర్, ఇటు జగన్ ల మధ్య మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. ఇటువంటి తరుణంలో జగన్ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల ముంగిట ఇదో ప్రతికూల అంశం గా మారే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.

ఒకవైపు కేంద్రం, మరోవైపు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ ప్రయోజనాలకు సంబంధించి పెద్ద నాటకమే జరుగుతోంది. కేంద్ర పెద్దలకు జగన్ సన్నిహితుడు, అటు తెలంగాణ సీఎం కేసీఆర్కు సైతం నిజమైన మిత్రుడు, అదే సమయంలో కెసిఆర్ కు కేంద్ర పెద్దలకు బహిర్గత వైరమే కానీ, అంతర్గతంగా సహకరించుకున్నట్లు పరిస్థితులు తెలియజేస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల దృష్ట్యా కృష్ణా జలాల పంపకాల పునః సమీక్ష కు కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వడం రాజకీయాల్లో భాగమే. ఈ విషయంలో జగన్ పోరాడకపోవడం రాష్ట్రానికి శాపం గా మారింది. ఈ విషయంలో కానీ జగన్ చొరవ చూపకపోతే ఏపీ ప్రజల్లో పలుచన కావడం ఖాయం.