వైఎస్ జగన్ ప్రజలపై వరాల వాన కురిపిస్తున్నారు. వేల కోట్ల సంక్షేమ పథకాలు వెదజల్లుతున్నాడు. అయినా పార్టీని నమ్ముకున్న వాళ్లకు మాత్రం ఏమీ చేయడం లేదనే అపవాదు ఉంది. ఇప్పుడు అదే నిజం అవుతోంది.
Also Read: రామచంద్రమూర్తి రాజీనామాకు కారణమిదేనా?
వైసీపీ పాలనలోనూ టీడీపీ నేతలకే కాంట్రాక్టులు.. అది వేల కోట్లవి.. ఏంటి దారుణం.. ఏంటీ అమానుషం.. పార్టీ కోసం పదేళ్లుగా జెండా మోసిన వారికి చిప్పే గతా? అని వైసీపీ నాయకులు.. శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ పాలనలో పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు లేదని.. టీడీపీ నుంచి వలసవచ్చిన వారికే పదవులు, కాంట్రాక్టులని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా అతిపెద్ద కాంట్రాక్టు మరోసారి టీడీపీ నేతకే దక్కడం అందరినీ షాక్ కు గురిచేసింది. నెల్లూరు జిల్లా పరిధిలోని 1000 ఎకరాల విలువైన సిలికా మైనింగ్ భూముల లీజును ఒకే కంపెనీకి కట్టబెట్టారు. ఇన్నాళ్లు ఈ 1000 ఎకరాలను విడదీసి సుమారు 80 కంపెనీలకు లీజు ఇచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎంత ఉదారతతో లీజు విధానంలో మార్పులు తీసుకొచ్చి ఏకంగా టెండర్లలో పాల్గొనడానికి రూ.507 కోట్ల మైనింగ్ వార్షిక టర్నోవర్ నిబంధన పెట్టింది.
ఈ పరిణామంతో చిన్నా చితక కంపెనీలన్నీ టెండర్లలో పాల్గొనకుండా ఎగిరిపోయాయి. దీంతో ఈ టెండర్లలో టీడీపీ నామినేట్ చేసిన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు.. ప్రముఖ పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డికి చెందిన అవంతిక ఎక్స్ పోర్ట్స్ సంస్థ ఈ 1000 ఎకరాల లీజును చేజిక్కించుకుంది. వైసీపీ ప్రభుత్వం ఇంత తంతగం చేసి ఆ భారీ కాంట్రాక్టును టీడీపీకి సానుభూతిపరుడైన పారిశ్రామికవేత్తకే కట్టుబెట్టడం నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది.
Also Read: వలసవాదులతో వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తి..!
దక్షిణ భారత దేశంలోనే నాణ్యమైన సిలికా మైన్లకు నెల్లూరు జిల్లా ప్రసిద్ధి. అలాంటి మైన్స్ ను టీడీపీకి చెందిన వ్యక్తికి కట్టబెట్టడంపై వైసీపీ నేతలు స్థానికంగా ఆగ్రహం వ్యక్తం అవుతోందట.. ఇప్పుడు ఇదే టాపిక్ నెల్లూరు జిల్లా వైసీపీలో సంచలనమైంది. టీడీపీ నేతకు కాంట్రాక్టు అప్పగించిన వైనంపై వైసీపీ నేతలు జీర్ణించుకోవడం లేదు.