అమరావతిలో రాజధాని నిర్మించేందుకు రైతులు తమ భూములు ఇచ్చారు. ప్రభుత్వం చెప్పిన మాటలను నమ్మిన వారు నిండా మోసపోయారు. సరే…. మరో ప్రభుత్వం వచ్చి వారి బ్రతుకుని బాగు చేస్తుందన్న ఆశ కూడా ఇప్పుడు చచ్చిపోయింది. ఇక ఈ ప్రభుత్వమూ వచ్చి తమకూ మీ భూములు కావాలని అడిగితే ఇస్తారా…? “అసలు సమస్యె లేదు” అంటున్నారు రైతులు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం కోసం చంద్రబాబు హయాంలోనే ఒక ప్లాన్ సిద్ధమైంది. అందులో భాగంగా ఒక ప్రాజెక్టు నిర్మాణం కోసం కొన్ని భూములను సేకరించేందుకు అధికారులు రాజధాని అమరావతి పరిధిలోని అన్ని గ్రామాల్లో పర్యటించారు. గ్రామ సభలు నిర్వహించారు. ఎప్పటిలాగే జనాలను మభ్యపెట్టడం మొదలుపెట్టారు. భూముల మార్కెట్ రేటుకి 1.6% అదనంగా ఇస్తామన్నారు. కానీ రైతు మాత్రం ససేమిరా అన్నారు.
“ప్రభుత్వాలు చెప్పే మాటలను చచ్చినా నమ్మలేం.. గత ప్రభుత్వం అమరావతి విషయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయింది. ఒప్పందాలు నిలబడలేదు. ఈ ప్రభుత్వం మా బాధలను లెక్కచేయడం లేదు. అలాంటప్పుడు మేం ప్రభుత్వాన్ని ఎలా నమ్మగలం? ” అంటూ ఒక రైతు నేరుగా అధికారులను నిలదీశాడు. దీంతో ఒక్కసారిగా అధికారులకు ఏమి చేయాలో అర్థం కాలేదు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినంత పని అయింది.
అమరావతి వేరే…. ఇతర ప్రాజెక్టుల భూసేకరణ వేరే. కానీ రైతు మనోభావాలు మాత్రం ఎక్కడ అయినా ఒక్కటే. అంతేకాదు భవిష్యత్తులో ప్రభుత్వానికి ఒక అమరావతి ప్రాంతం నుంచే కాకుండా ఏ ప్రాంతంలో కూడా రైతులు భూములను ఇచ్చే పరిస్థితి లేదు. అంత నమ్మకం పోగొట్టుకుంటే.. ఈ ప్రభుత్వం కావచ్చు, రేపు రాబోయే ప్రభుత్వం కావచ్చు, తమను ఇప్పటికే పాలించిన ప్రభుత్వం కావచ్చు…. ఎవరైనా సరే ప్రజలకు హామీ ఇచ్చి అది నెరవేర్చకపోతే పూర్తిగా వారి పై వ్యతిరేక భావం అనేది ఏర్పడుతుంది. ఇకపై భూసేకరణ ఈ రాష్ట్రంలో ఇది అంత తేలికైన వ్యవహారం కాదని అధికారులకు అర్థమైపోయింది.
చివరికి ఎవరైనా ఒక్కటే…. అధికారంలో ఉన్నవాళ్లు మారిన ప్రతిసారీ ఇలా హామీలు చేసుకున్న ఒప్పందాలకు విలువ లేకుండా లేకపోతే…. అసలు వ్యవస్థకు అర్థం ఏముంటుంది? ఏదో ఆషామాషీగా మూడు రాజధానులు లేదా ఇంకొక అడ్డంకిని చెప్పి ప్రభుత్వాలు అడ్డగోలుగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే దానికి రైతులు బాధలు అనుభవించాలా? వారు అందలం ఎక్కి కూర్చుని ఉన్న పల్లకిలిని ఎన్నాళ్ళని రైతులు మోస్తూ ఉంటారు..? చివరికి వెన్ను విరిగాక అయినా విశ్రమించాల్సిందేగా…!