BRS: మరికొద్ది రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని అధికార భారత రాష్ట్ర సమితి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వివిధ పార్టీల నుంచి చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ జాబితాలో ఆల్రెడీ యాదాద్రి కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ రెడ్డి చేరిపోయారు. కెసిఆర్ సమక్షంలో ఆయన కారు ఎక్కారు. ఇంకా చాలామంది కాంగ్రెస్ నేతలు కారు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం ఇంటలిజెన్స్ వర్గాల సర్వే, వివిధ ఏజెన్సీలు చేస్తున్న సర్వేలో తేలడంతో భారత రాష్ట్ర సమితి ఒకింత ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు నిర్వహించిన పార్టీ అంతర్గత సమావేశాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని గులాబీ బాస్ కెసిఆర్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం విషయంలో ఆయన పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.
ముందే అభ్యర్థుల ప్రకటన
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు భారత రాష్ట్ర సమితిలో పలు పార్టీలకు చెందిన వారు చేరుతూనే ఉన్నారు. వెళ్లేవారు వెళ్తూనే ఉన్నారు. అయితే పార్టీలో ఉన్న వారిలో కొంతమంది ప్రజాదరణకు దూరంగా ఉన్నారు. అయితే వారు టికెట్ ఇవ్వాలని గులాబీ బాస్ ను పోరు పెడుతున్నారు. అయితే వారిని సముదాయించేందుకు కెసిఆర్ రంగంలోకి దిగారు. మరి కొందరిని కేటీఆర్ సముదాయిస్తున్నారు. అయితే దీర్ఘకాలం ఇది సాధ్యం కాదు కనుక మరికొద్ది రోజుల్లో కేసీఆర్ అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. వల్ల అసంతృప్తులకు చెక్ పడుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ముందే అభ్యర్థులను ప్రకటించడం వల్ల విపక్ష పార్టీల మీద ఒత్తిడి పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు. వచ్చే నెలలో శ్రావణమాసం ప్రవేశించిన తర్వాత ఆయన ఈ ప్రక్రియకు శ్రీకారం పెడతారని తెలుస్తోంది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎవరైనా నేతలు అసంతృప్తితో ఉంటే వారికి ఏదో విధంగా పదవులు ఇస్తామని కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు కోలుకునే పరిస్థితి ఉండదని భారత రాష్ట్ర సమితి భావిస్తోంది.
అక్కడ వీక్
కొన్ని నియోజకవర్గాల్లో భారత రాష్ట్ర సమితి వీక్ గా ఉందని సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఉదాహరణకు 2018 ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆమె అనతి కాలంలోనే భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఆమెకు అప్పట్లో ప్రత్యర్థిగా భారత రాష్ట్ర సమితి నేత తీగల కృష్ణారెడ్డి ఉండేవారు. ఆమె రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఆయన.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల ఆయన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారని ప్రచారం జరుగుతున్నది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.. అయితే మహేశ్వరం నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితికి పట్టు అంతంత మాత్రమే. సబితా ఇంద్రారెడ్డి భారత రాష్ట్ర సమితిలో చేరినప్పటికీ అక్కడ అధికార పార్టీకి చిక్కిన పట్టు తక్కువే. ఇలాంటి నియోజకవర్గాలు తెలంగాణలో చాలానే ఉన్నాయి. మరి వాటి విషయంలో మరింత ఫోకస్ గా ఉండాలని భారత రాష్ట్ర సమితి భావిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా అంత సులభం కావడం లేదు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాలు, నల్లగొండ జిల్లాలోని కొన్ని ఏరియాలో భారత రాష్ట్ర సమితికి అంత అనుకూలంగా లేవు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ పార్టీ ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీనిని చక్క దిద్దేందుకు గులాబీ బాస్ ఎటువంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాల్సి ఉంది.