Congress Second List
Congress Second List: గత శనివారం 55 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ.. రెండవ జాబితా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కీలక నేతలు మంతనాలు జరుపుతున్నారు. పార్టీకి సంబంధించిన పెద్దలు గాంధీభవన్లో గత మూడు రోజుల నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదటి జాబితాలో బీసీ కులాలకు అంతగా ప్రాధాన్యం దక్కని నేపథ్యంలో.. ఈ జాబితాలో వారికి సింహభాగం కేటాయించే అవకాశం కనిపిస్తున్నది. ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీ లకు కూడా ప్రాధాన్యం ఇచ్చేలాగా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండవ జాబితా ప్రకటించే సమయంలో ఇంటిపోరు పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీలో లుకలుకలు బయటికి వస్తుండడం.. పార్టీ అధ్యక్షుడు వసూళ్ళకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది.
మొదటి జాబితా తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. వారిని సముదాయించడం పార్టీ అధిష్టానానికి పెద్ద తలకాయ నొప్పిగా మారింది. అసంతృప్తి నేతలు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి ధర్నాలు, ఆందోళనలు చేయడం, ఫ్లెక్సీలు చంపడం వంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొందరైతే గాంధీ భవన్ కు తాళాలు కూడా వేశారు. సోమశేఖర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి వంటి వారు రేవంత్ రెడ్డి నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక మేడ్చల్ టికెట్ ఆశించి భంగపడిన హరి వర్ధన్ రెడ్డి సైతం రేవంత్ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోని సీనియర్లు సర్ది చెబుతున్నప్పటికీ ఆ నాయకులు వినిపించుకోకపోవడం విశేషం. ఈ క్రమంలో రెండవ జాబితాలో ఆ వర్గాల నాయకులు ఆశించిన సీట్లు లభిస్తాయా? బీసీ నాయకులు ఆశించిన విధంగా సీట్లు వస్తాయా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ బీసీ నేతల్లో మధు యాష్కి గౌడ్, పొన్నం ప్రభాకర్ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ వంటి వారికి ఇంకా టికెట్లు కేటాయించలేదు. వారికి పార్టీ నుంచి కూడా ఎటువంటి సమాచారం లేదు. ఈ క్రమంలో పార్లమెంట్ మాజీ సభ్యులు రాజయ్య, బలరాం నాయక్, షెట్కార్ వంటి వారు సోమవారం మధు యాష్కి ఇంట్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీసీల సీట్లు, మొదటి జాబితాలో తమకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం పట్ల వారు చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల పార్టిలో చేరిన వారికి టికెట్లు ఇచ్చిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇక కమ్యూనిస్టులు, తెలంగాణ జన సమితి పార్టీతో పొత్తు నేపథ్యంలో సీట్లు ఎలా సర్దుబాటు చేయాలనే విషయం పట్ల కాంగ్రెస్ పార్టీ మల్ల గుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. అందువల్లే రెండవ జాబితా ఆలస్యం అవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో కూడా ఇదే విధంగా అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యం చేయడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. మరోవైపు భారత రాష్ట్ర సమితి అధినేత వరుసగా ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా రెండవ జాబితా విషయంలో జాప్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టికెట్ల కేటాయింపుకు సంబంధించి త్వరగా నిర్ణయం తీసుకుంటే పార్టీకి మంచిదని హితవు పలుకుతున్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Is it because of them that the second list of congress is breaking
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com