Madhya Pradesh: ఉల్లి తీర్చిన కష్టాలు తల్లి కూడా తీర్చలేదని ఓ సామెత ఉంది. అలాగే వెల్లుల్లి చేసే మేలు తండ్రి కూడా చేయడని ఉత్తర భారత దేశంలో ఓ నానుడి ఉంది. ఉల్లి, వెల్లుల్లి ఆధారంగా మన దేశ రాజకీయాలు నడిచాయంటే మామూలు విషయం కాదు. 2014లో యూపీఏ ప్రభుత్వం ఓడిపోవడానికి వెల్లుల్లి (కొన్నిసార్లు దీని ధరలు భారీగా పెరిగాయి) కూడా ఓ కారణం. మనదేశంలో వంటకాలలో వెల్లుల్లి వాడకం విపరీతంగా ఉంటుంది. అల్లం, వెల్లుల్లి మిశ్రమాన్ని విస్తృతంగా వినియోగిస్తుంటారు.. కూరలలో ఉల్లి తర్వాత, వెల్లుల్లి ఆ స్థాయిలో వినియోగిస్తుంటారు. అయితే ఇప్పటివరకు మనం వెల్లుల్లిని దుంప జాతికి చెందిందిగా భావించాం. కొన్ని ప్రాంతాలలో వెల్లుల్లిని మసాలా దినుసుగా భావిస్తుంటారు. అయితే వెల్లుల్లి దుంప జాతికి చెందిందా? మసాలా దినుసా? అనే చర్చ ఎప్పటి నుంచే ఉంది. అయితే వెల్లుల్లి అనేది గతంలో మసాలా జాబితాలో ఉండేది. అయితే అప్పట్లో రైతు సంఘాలు విజ్ఞప్తి చేయడంతో కూరగాయల కేటగిరిలోకి వెల్లుల్లి చేరిపోయింది. అనంతరం కొంతకాలానికి ఆ ఉత్తర్వును వ్యవసాయ శాఖ రద్దు చేసింది. వెల్లుల్లికి మసాలా హోదాను మళ్ళీ కల్పించింది.
కచ్చితంగా ఉంటుంది
మన దేశంలో ప్రతి వంటింట్లో వెల్లుల్లి కచ్చితంగా ఉంటుంది. కేవలం రుచికి మాత్రమే కాకుండా, ఆరోగ్య పరిరక్షణలో వెల్లుల్లి కీలకపాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇది రక్తంలో కొవ్వును తగ్గిస్తుంది.. గుండె పనిచేసే విధాన్ని మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్ లపై పోరాడే పదార్థాలు వెల్లుల్లిలో ఉంటాయి. ఇదే విషయాన్ని పలు అధ్యయనాలు చెప్పాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ వెల్లుల్లి కూరగాయ జాతికి చెందిందా? మసాలా దినుసా? అనే ప్రశ్న ఎప్పటినుంచో ఉంది. అయితే ఈ చర్చకు మధ్యప్రదేశ్ హైకోర్టు శుభం కార్డు వేసింది.
2015 నుంచి చర్చ
2015 నుంచి మనదేశంలో వెల్లుల్లి కి సంబంధించిన చర్చ జరుగుతోంది. ఇది మసాలా దినుసా? లేక కూరగాయనా? అనే సందేహం మీడియాలో తరచూ వినిపించేది.. అప్పట్లో రైతు సంఘాలు విన్నవించడంతో వ్యవసాయ శాఖ వెల్లుల్లికి మసాలా కేటగిరి ఇచ్చింది. అయితే అప్పట్లో వెల్లుల్లిని సుగంధ ద్రవ్యంగా పేర్కొన్నారని వ్యవసాయ శాఖ వెల్లడించింది. 1972లో ఇందుకు సంబంధించిన ఒక ఉత్తర్వు వెల్లడైందని పేర్కొంది. ఈ వ్యవహారం నచ్చకపోవడంతో 2017లో రైతు సంఘాలు మళ్ళీ రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. తొమ్మిది సంవత్సరాల అనంతరం మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ ధర్మాసనం ఈ అంశానికి సంబంధించి ప్రత్యేకమైన తీర్పును వెల్లడించింది..
వ్యవసాయ శాఖ ఏం నిర్ణయం తీసుకుంటుందో..
ఇండోర్ ధర్మాసనం 2015 నాటి నిర్ణయాన్ని సమర్థించింది. వెల్లుల్లి కూరగాయ అని ప్రకటించింది. దీంతో వెల్లుల్లి మళ్ళీ కూరగాయల లిస్టులోకి వచ్చేసింది.. గతంలో ఈ నిర్ణయాన్ని వ్యవసాయ శాఖ వ్యతిరేకించింది? మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ధర్మాసనం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటుందా? లేక కూరగాయ కాదని సుప్రీంకోర్టుకు వెళుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది .