Andhra Pradesh, Congress Leadership: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. వైసీపీని ఎదుర్కొనే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా తనదైన శైలిలో మార్పులకు శ్రీకారం చుడుతోంది. పీసీసీ అధ్యక్షుడిని మార్చి సమర్థుడైన వారికి అధికారం కట్టబెట్టాలని బావిస్తోంది. ఇన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలు స్తబ్దుగా ఉండడంతో పార్టీని బలోపేతం చేసే నాయకుడి కోసం ప్రణాళికలు రచిస్తోంది. అధిష్టానం పార్టీలో భారీ మార్పులు చేయాలని ఆలోచిస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించేందుకు ఏర్పాట్లు చేస్తోందని సమాచారం.
సీఎం జగన్ ను ఎదుర్కొనేందుకు అదే ప్రాంతానికి చెందిన నేతకు పట్టం కట్టాలని నిర్ణయించింది. పైగా అదే వర్గానికి చెందిన నేతతో చెక్ పెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో లాబీయింగ్ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. రాహుల్ గాంధీ సైతం కిరణ్ కుమార్ రెడ్డి కి పీసీసీ ఇచ్చేందుకు సుముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీని రాబోయే ఎన్నికలకు సిద్ధం చేయాలని సూచిస్తోంది. పీకే సూచనలతో అన్ని ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ సూచనలతో పార్టీ భవిష్యత్ పై దృష్టి సారించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లతో పాటు పలువురు నేతలతో పీకే సమాలోచనలు చేశారు. పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకే తదితర పార్టీల కలయికతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పీకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం సాగుతోంది. దీనిపై త్వరలో ఆయన ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్, తమిళనాడులో మమతా బెనర్జీ, స్టాలిన్ విజయం సాధించడంలో పీకే ప్రముఖ పాత్ర పోషించారు. ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న పీకే సూచనల మేరకే కాంగ్రెస్ పార్టీ తన వైఖరి మార్చుకుంటోంది. వ్యూహాలను రూపొందించుకుంటోంది. ఇప్పటికే తెలంగాణలో రేవంత్ రెడ్డి, పంజాబ్ లో నవజ్యోతి సింగ్ సిద్దూకు పదవులు కట్టబెట్టి అక్కడ కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో సైతం ముందుకు నడిపించే విధంగా వ్యూహాలు ఖరారు చేసే క్రమంలో నాయకత్వ మార్పు అనివార్యమని భావిస్తున్నారు. అందుకే ప్రస్తుతమున్న అధ్యక్షుడిని మార్చి కొత్త వారికి అవకాశం కల్పించి వారిలో నూతనేత్తేజం నింపాలని చూస్తోంది. ఇందు కోసం పటిష్టంగా నిర్ణయాలు తీసుకునేందుకు నాయకత్వం కావాలని చూస్తోంది.