
ఏది ఏమైతేనేమీ.. తెలంగాణలో టీడీపీ అంతర్థానమై పోయింది. ఎన్టీఆర్ స్థాపించిన బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వెలుగులు తెలంగాణలో ఆరిపోయాయి. ఉన్న ఆఖరి తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్.రమణ సైతం రాజీనామా చేసి టీఆర్ఎస్ గూటికి వెళుతుండడంతో ఇక టీడీపీకి తెలంగాణలో ఆశలు లేకుండా పోయాయి.
అయితే ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు రాజకీయం ఎలా చేస్తారు? ఎలా తెలంగాణ రాజకీయాల్లో తన ఉనికి చాటుతారు? అంటే తన మాజీ టీడీపీ నేతల ద్వారా అని అంటున్నారు మంత్రి హరీష్ రావు. తాజాగా ఆయన ఒకసంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎంత వద్దంటున్నా రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేయడం వెనుక చంద్రబాబు లాబీయింగ్ సోనియా వద్ద పనిచేసిందని.. అందుకే తన అనుంగ శిష్యుడు రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇప్పించాడని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు సిఫారసు వల్లే రేవంత్ కు పీసీసీ వచ్చిందని.. మూడేళ్ల ముందు నుంచే తెలుగుదేశం నేతలను కాంగ్రెస్ లోకి పంపి చంద్రబాబు పెద్ద స్కెచ్ గీశాడని హరీష్ రావు ఆరోపించారు.
2018 ఎన్నికల్లోనే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని తెలంగాణలో అధికారం చెలాయించాలని చూశారు. కానీ నాడు టీఆర్ఎస్ లేవనెత్తిన ‘ఆంధ్రా బాబు’ ఎత్తుగడ పనిచేసి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను ఓడించారని.. చంద్రబాబును వెళ్లగొట్టారు. ఈ క్రమంలోనే ఈసారి కాంగ్రెస్ తోనే తెలంగాణలో రాజకీయం చేయాలని చంద్రబాబు వ్యూహం పన్నారని హరీష్ రావు ఆరోపిస్తున్నారు.
టీడీపీ ముఖం పెట్టుకొని వస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరని.. అందుకే తన మనుషులను కాంగ్రెస్ పార్టీలోకి పంపించి తెలంగాణలో చంద్రబాబు అడుగుపెట్టాలని చూస్తున్నట్టు టీఆర్ఎస్ అనుమానిస్తోంది. అందుకే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని ఉన్నఫళంగా టీఆర్ఎస్ లోకి చేర్చుకోవడం వెనుక అసలు రీజన్ ఇదేనంటున్నారు. చంద్రబాబుయే కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి వస్తున్నారని టీఆర్ఎస్ అనుమానిస్తోంది. తాజాగా రేవంత్ రెడ్డి నియామకంలో చంద్రబాబు పాత్ర ఉందని టీఆర్ఎస్ బలంగా నమ్ముతోంది. అందుకే టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా కదులుతున్నట్టుగా తెలుస్తోంది.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయ్యాక చంద్రబాబు తన మకాంను ఆంధ్రాకు మార్చారు. కానీ ఆ కేసుతోపాటు.. కొన్ని లింకులు తెలంగాణతో ముడిపడి ఉన్నాయి. వాటన్నింటిని తొలిగిపోవాలని చంద్రబాబుకు అనుకూల ప్రభుత్వం తెలంగాణలో ఉండాలి. రేవంత్ రెడ్డి సీఎం అయితే చంద్రబాబుయే మొదట ఆనందిస్తాడు. అందుకే కాంగ్రెస్ ద్వారా తన పంతం నెగ్గించుకోవడానికి బాబు ఆలోచిస్తున్నట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.