వచ్చే నెలలోనే తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక కోసం షెడ్యూల్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో పార్టీలు ఇప్పటికే అక్కడే మకాం వేశాయి. ఏయే పార్టీ నుంచి ఎవరిని రంగంలోకి దింపాలని సిద్ధం కాగా.. మిత్రపక్షాలపై బీజేపీ–జనసేనల పంచాయతీ మాత్రం కొలిక్కిరావడం లేదు. బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటాడని ఆ పార్టీ ప్రకటిస్తుండగా.. జనసేన అభ్యర్థినే రంగంలోకి దింపాలని ఆ పార్టీ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: కడపలో జగన్‌కు షాక్ : టీడీపీ మద్దతుదారుల విజయం
మరోవైపు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తమ పార్టీ అభ్యర్థినే బరిలోకి దింపాలని గట్టిగా కోరుకుంటున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థి ఉండాలని పవన్ కల్యాణ్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికపైన ఇప్పటికీ రెండు సార్లు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి వచ్చారు. అధిష్టానం పెద్దలను కలిశారు. తమ పార్టీ క్యాడర్ జనసేన అభ్యర్థి బరిలో ఉండాలని బలంగా కోరుకుంటున్నారని, ఈసారి అవకాశం ఇవ్వాలని పవన్ కల్యాణ్ కోరి వచ్చారు. ఇప్పటికే జనసేన అధినేత తిరుపతిలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి క్యాడర్ అభిప్రాయాలను తెలుసుకున్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో బీజేపీ కంటే జనసేన బలంగా ఉందని పవన్ కల్యాణ్ సైతం అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది.
బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తిరుపతిలో తాము పోటీ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. సోము వీర్రాజు తిరుపతి ఉప ఎన్నికపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు దాసరి శ్రీనివాసులు, రత్నప్రభల పేర్లను పరిశీలిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఢిల్లీ పెద్దలను కలసి వచ్చినా చివరకు తమ పార్టీ అభ్యర్థి ఖరారవుతారన్న విశ్వాసంతో ఉన్నారు.
Also Read: చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు
మార్చి మొదటి వారంలో అమిత్ షా తిరుపతికి రానున్నారు. ఈ సమావేశంలో అభ్యర్థి ఎవరనేది తేల్చనున్నారు. పవన్ కల్యాణ్ మాత్రం ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత జనసేన అభ్యర్థి బరిలో ఉంటారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పార్లమెంటు ఎన్నిక కావడంతో తామే పోటీ చేయాలని బీజేపీ నేతలు కూడా గట్టిగా పట్టుబడుతున్నారు. మొత్తం మీద ఈ క్యాండిడేట్ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగక తప్పదేమో.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్