Hyderabad Golf Club: హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్.. ఇందులో కార్పొరేట్లు.. కుబేరులు.. సినీ, రాజకీయ, పారిశ్రామిక దిగ్గజాలు.. సీనియర్ ఐఏఎస్ లు మాత్రమే.ఉంటారు! అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియదు. ఒకవేళ సామాన్యులు ఎవరైనా అందులోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే రకరకాల చర్యలు ఉంటాయి. కేవలం సభ్యత్వ రుసుము ద్వారానే రూ.100 కోట్లకుపైగా నిధులను సమకూర్చుకున్న క్లబ్ ఇది. అలాంటి క్లబ్ లో ప్రస్తుతం నిధుల గోల్‌మాల్ జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.
క్లబ్ నిధులను మళ్లించారు
క్లబ్‌లో నిర్మాణ పనులకు కాంట్రాక్టులు ఇచ్చి.. వాటికి అక్రమంగా అధిక మొత్తంలో చెల్లింపులు చేశారు. తమకు నచ్చిన వారికి ‘క్విడ్ ప్రో కో’ పద్ధతిలో సదరు కాంట్రాక్టులను కట్టబెడుతున్నారు. మరీ ముఖ్యంగా, సభ్యత్వాల్లోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు. కొంతమందికి అర్హత లేకపోయినా సభ్యత్వం ఇస్తున్నారు. క్లబ్‌లో జరుగుతున్న అక్రమాలను హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ తేల్చింది. అయినా.. ఎటువంటి చర్యలూ లేవు. దాదాపు రెండు దశాబ్దాలుగా కమిటీ ఆఫీసు బేరర్లంతా వాళ్లే. ఒకరికి మరొకరు సహకరించుకుంటూ వారే సభ్యులుగా కొనసాగుతున్నారు. అక్రమాలకు ఇది కారణమనే ఆరోపణలూ ఉన్నాయి. క్లబ్ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
200 ఎకరాల్లో.. 150 ఎకరాలు
చరిత్రాత్మక గోల్కొండ కోటకు ఆనుకుని ఉన్న దాదాపు 200 ఎకరాల్లో 150 ఎకరాలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ (హెచ్‌జీఏ)కు లీజుపై కేటాయించింది. సువిశాలమైన స్థలంలో, గోల్కొండ కోటకు ఆనుకునే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో దీనిని అభివృద్ధి చేశారు. అందుకే ఇందులో సభ్యత్వం కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. గోల్ఫ్ క్లబ్‌లో జీవితకాల సభ్యత్వ రుసుము రూ.60 లక్షలు. దీనినిబట్టే ఇక్కడి సభ్యుల స్థాయిని అర్థం చేసుకోవచ్చు. అంతేనా.. ఇందులో సభ్యత్వం కోసం పెద్దఎత్తున బడా బాబులు గత కొద్ది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. వీరిలో సినీ, రాజకీయ, పారిశ్రామిక దిగ్గజాలున్నాయి. అయినా, అందులో ప్రవేశం దొరకదు. ప్రభుత్వ.. ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల నుంచి ఎలాంటి నిధులు పొందకుండా కేవలం సభ్యత్వ రుసుముతోనే రూ.100 కోట్లకుపైగా నిధులు సమకూర్చుకున్న ఘనత హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌ది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి గోల్ఫ్ పోటీలతో క్లబ్ పేరుగాంచినా.. ఇటీవలి కాలంలో వెలుగుచూసిన అనేక అక్రమాలు, కుంభకోణాలతో దాని ప్రతిష్ఠ మసకబారుతోంది. ప్రస్తుత మేనేజింగ్ కమిటీపై ఎప్పటి నుంచో అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక, నిర్వహణపరమైన అవకతవకలు జరుగుతున్నాయని గుర్తించారు కూడా. ఈ ఏడాది ఏప్రిల్ 27న జరిగిన మేనేజింగ్ కమిటీ సమావేశంలో వీటిపై చర్చించారు. ఆ సమావేశంలోనే అవకతవకల నిర్ధారణకు ముగ్గురు సభ్యులతో కమిటీని వేయాలని నిర్ణయించారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నియమించిన త్రిసభ్య కమిటీ సైతం అక్రమాలను నిజమని నిర్ధారించింది. క్లబ్‌కు చెందిన రూ.30 కోట్లకుపైగా నిధులను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలున్నాయి.
‘క్విడ్ ప్రో కో’ విధానంలో..
పాలకవర్గంలోని కీలక సభ్యులు ఈ అక్రమాలు, అవకతవకలకు పాల్పడ్డారని తెలుస్తోంది. అలాగే, క్లబ్‌లో చేపట్టిన నిర్మాణ పనుల్లోనూ తీవ్ర అవకతవకలు జరిగాయని త్రిసభ్య కమిటీ తేల్చింది. క్లబ్ కిచెన్ నిర్మాణానికి సంబంధించిన పనులకు రూ.30.87 లక్షలు చెల్లించాల్సి ఉండగా, రూ.1.14 కోట్లు చెల్లించారని కమిటీ తేల్చింది. ఇక్కడ చేపట్టిన పనులకు సంబంధించి బిడ్లను ఆహ్వానిస్తే.. తక్కువకు కోట్ చేసిన వారికి కాకుండా ఇతరులకు కట్టబెట్టారని తేల్చింది. చేసిన కొన్ని పనులకు సంబంధించి అంతర్గత ఆడిట్ నిర్వహించలేదని, క్లబ్ నిర్వహణ కమిటీ సైతం ఈ విషయాలను పెడచెవిన పెట్టిందని పేర్కొంది. అనేక పనులకు సంబంధించి చేసిన ఖర్చులకు లెక్కాపత్రాల్లేవని నిర్ధారించింది. అంతేనా.. 150 ఎకరాల్లో విస్తరించిన గోల్ఫ్ క్లబ్.. అది చాలదన్నట్లు పక్కనే ఉన్న కేంద్ర పురావస్తు శాఖ స్థలాన్నీ కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు సాగిస్తోంది. దీనికి సంబంధించి మేనేజింగ్ కమిటీకి ఈ ఏడాది మే 22వ తేదీన తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవల్‌పమెంట్ కార్పొరేషన్ నోటీసులు కూడా జారీ చేసింది. లీజు ఒప్పందానికి కట్టుబడి ఉండాలని నిర్దేశించింది. క్లబ్‌లో అంతర్గతంగా అక్రమాలు జరుగుతున్నాయని, అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని తేల్చింది. గోల్కొండ కోట స్థలం కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్ఐ) పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలన్నా జీహెచ్‌ఎంసీతోపాటు ఏఎస్ ఐ అనుమతి కూడా తప్పనిసరి. కానీ, క్లబ్‌కు ఆనుకుని ఉన్న నయాఖిలా ప్రాంతంలోని ఏఎస్ఐ స్థలంలో కోట ప్రహరీ ప్రాంతాన్నే ఆక్రమించి గోల్ఫ్ కోసం వినియోగిస్తోంది. దీనిపై ఏఎస్ఐ పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. జీహెచ్‌ఎంసీ కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
ఇష్టారాజ్యంగా సభ్యత్వాలు
హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌లో సభ్యత్వం కోసం పెద్దఎత్తున డిమాండ్ నెలకొనడంతో అక్రమాలూ జరుగుతున్నాయి. నిబంధనలు పాటించకుండా, అర్హత లేని వారికి సభ్యత్వం ఇస్తున్నారు. వీటి వెనక భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయని ఇతర సభ్యులు ఆరోపిస్తున్నారు.
నిజానికి, క్లబ్‌లో వివిధ రకాల సభ్యత్వాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ‘సర్వీస్ మెంబర్స్’! అంటే, సీనియర్ ఏఐఎస్ అధికారులు. రాష్ట్ర క్యాడర్‌కు చెంది, హైదరాబాద్‌లో పని చేస్తున్న సీనియర్ ఏఐఎస్ అధికారులకు ‘సర్వీస్ మెంబర్స్’ విభాగంలో సభ్యత్వం ఇవ్వచ్చు. దీనికి ప్రత్యేక నిబంధనలున్నాయి. రాష్ట్ర సర్వీసులోని ఏఐఎస్ లు అయితే జాయింట్ సెక్రటరీ కంటే పైస్థాయి వారికి, కేంద్ర సర్వీసులో ఉన్న ఏఐఎస్ లలో డైరెక్టర్ అంతకంటే పైస్థాయి అఽధికారులకు రూ.25 వేలకే సభ్యత్వం ఇవ్వవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. అయితే ఈ విభాగంలో సభ్యత్వాలు ఇష్టారాజ్యంగా కేటాయిస్తున్నారు. అర్హత లేకపోయినా తమ వ్యక్తిగత అవసరాలు, ప్రయోజనాల కోసం పాలకవర్గం సభ్యత్వం ఇస్తోందని సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో నిర్ణయం తీసుకోకుండానే సభ్యులను నియమిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇటీవల ఇద్దరు సభ్యులను ఇలాగే నియమించారని తెలుస్తోంది. దాంతో, వారిని ఏ ప్రాతిపదికన నియమించారంటూ కొందరు సభ్యులు ప్రశ్నించారు. అయినా, పాలక వర్గం నుంచి సమాధానం లేదు. దాంతో, విషయం టీఎస్ టీడీసీ దృష్టికి వెళ్లింది. కొత్త సభ్యులను ఎలా నియమించారో తెలపాలంటూ తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ జూన్ 23న క్లబ్ మేనేజింగ్ కమిటీకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే, సభ్యుల నియామకం వెనక భారీగా డబ్బులు చేతులు మారాయని ఇతర సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇతర విభాగాల్లోనూ సభ్యత్వాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని వివరిస్తున్నారు. ఇప్పటికే అనేక ఆరోపణలు రావడం, త్రిసభ్య కమిటీ సైతం అక్రమాలను నిర్ధారించడంతో బాద్యులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.