AP Government: ఏపీ ప్రభుత్వానికి అంతర్మథనం ప్రారంభమైందా? ప్రభుత్వంతో పాటు సీఎం జగన్ గ్రాఫ్ పడిపోతుండడంతో కలవరం చెందుతున్నారా? పైకి మాత్రం అదంతా టీడీపీ కుట్రగా అభివర్ణించి లోలోన బాధపడుతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు అందుకు బలం చేకురుస్తున్నాయి. ఇటీవల జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలే ఏపీ ప్రభుత్వంతో పాటు సీఎం జగన్ అట్టడుగున నిలిచారు. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలకుగాను 20వ స్థానంలో నిలిచారు. అయితే ఇదంతా చంద్రబాబు కుట్రేనని బయటకు చెబుతున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. అసలు ఎందుకిలా జరుగుతోందని శోధన ప్రారంభించింది. ప్రజలకు సంక్షేమ పథకాల మాటున పప్పూ బెల్లంలా నగదు పంచుకొని పోతున్నా ఎందుకీ అసంతృప్తి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాజకీయాలకతీతవంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నా ఏంటీ ఈ పరిస్థితి అంటూ ప్రభుత్వ వర్గాలు తెగ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల కోసం అన్నీ చేసినా ఏంటీ ఈ పరిస్థితి అంటూ తెగ బాధపడుతున్నాయి. అటు ప్రతీ 50 కుటుంబాలకు వలంటీరుతో పాటు గ్రామస్థాయిలో సచివాలయ వ్యవస్థ రూపంలో మెరుగైన పాలన అందిస్తున్నా ప్రజలు ఎందుకు సంతృప్తి చెందడం లేదని ఆలోచిస్తోంది. అందుకే సచివాలయ వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి ప్రయత్నిస్తోంది. అందుకే శుక్రవారం నుంచి సచివాలయాల బాట పట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

నాడు ప్రతిష్ఠాత్మకం..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయ వ్యవస్థను ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. ప్రజలకు గ్రామస్థాయిలో మెరుగైన సేవలందించేందుకుగాను సచివాలయ వ్యవస్థ ఎంతగానొ దోహదపడుతుందని భావించింది. సుమారు 19 శాఖలకు సంబంధించి సహాయకులను నియమించింది. వారికి సంక్షేమ పథకాలతో పాటు పౌరసేవలనుఅందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కానీ క్షేత్రస్థాయిలో ఇబ్బందులను మాత్రం పరిష్కరించలేకపోయింది. ఇప్పటికీ సచివాలయ ఉద్యోగులకు కార్యాలయ,.వసతి సమస్య వెంటాడుతోంది. ఇరుకు సందుల్లో, ఇబ్బందుల నడుమ కార్యాలయాలను నిర్వహిస్తూ వస్తున్నారు. సొంత భవనాల నిర్మాణం రెండేళ్లు పూర్తవుతున్నా కొలిక్కి రావడం లేదు. సాంకేతిక సమస్యలు సైతం ఎదురవుతున్నాయి. సచివాలయాల నిర్వహణ అటు పంచాయతీలకు కత్తిమీద సాములా మారింది.
Also Read: Athma Sakshi Survey: ఆత్మసాక్షి సర్వే: తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?
అటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాల అమలులో కూడాయ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అమలైన సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలో భారీగా కోత విధించారు. అటు అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఎటువంటి మౌలిక వసతులు కల్పించిన దాఖలాలులేవు. సంక్షేమ పథకాలకే నిధులు ఖర్చు పెడుతుండడం ప్రతిబంధకంగా మారింది. ప్రజల ఆలోచన సరళి మారింది. సంక్షేమం మాటున అభివృద్ధి లేదని భావించిన ప్రజలు ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించడం ప్రారంభించారు. దాని ఫలితంగానే ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. మరవైపు సచివాలయ వ్యవస్థ సైతం ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వకపోవడంతో వైసీపీ శ్రేణుల్లో కలవరం ప్రారంభమైంది.

ఎన్నికలు సమీపిస్తుండడంతో..
మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండడంతో వైసీపీ శ్రేణుల్లో అంతర్మథనం ప్రారంభమైంది. పరిస్థితి ఇలానే కొనసాగితే పుట్టి మునగడం ఖాయమని భావిస్తోంది. అందుకే అందుకు తగ్గ విరుగుడు చర్యలు ప్రారంభించింది. అసలు సమస్య ఎక్కడుందని తెలుసుకునే ప్రయత్నంచేస్తోంది. అన్ని రకాల సంక్షేమ పథకాలు సచివాలయ వేదికగా అమలు చేస్తున్నందున అక్కడ నుంచే పరిస్థితిని తెలుసుకోవాలని నిర్ణయించింది. శుక్రవారం నుంచి సచివాలయాల సందర్శన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. బాధ్యతలను ఎంపీడీవోలు, మునిసిపల్ కమిష,నర్లు, జాయింట్ కలెక్టర్లకు అప్పగించింది. వారు క్షేత్రస్థాయిలో సచివాలయాలను సందర్శించి సంక్షేమ పథకాల అమలు, వైఫల్యాలపై ఆరా తీయనున్నారు. ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితిని విన్నవించనున్నారు. దానికి అనుగణంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించనుంది. మొత్తానికి వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ గ్రాఫ్ తగ్గలేదని భావిస్తూనే ప్రభుత్వం విరుగుడు చర్యలు ప్రారంభించిందన్న మాట.