CM Jagan- Kamma Community: కులం.. ఇప్పుడు రాజకీయాల్లో ఒక భాగం. అందునా విభజిత ఆంధ్రప్రదేశ్ లో అధికం. వైసీపీ ప్రభుత్వం గద్దెనక్కడానికి కులం కార్డు ఎక్కువగా తెరపైకి వచ్చింది. కాదు తెరపైకి తెచ్చి రుద్దారు. బాగానే రాజకీయ లబ్ధి పొందారు. వాస్తవానికి కులం అని మాటాడడానికి ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. కానీ ఏంచేస్తాం కులాల కుంపట్టు రాజేసి మంట కాగుకునే జుగుప్సాకర రాజకీయాలకు తెరతీశారు రాష్ట్రంలో. తాజాగా మంత్రివర్గ విస్తరణలో కులాల కుంపట్లను మరింతగా రాజేశారు. సమాజమంటే అన్ని కులాల సమాహారం. వారందరికీ సేవ చేసేందుకు ఏర్పాటైనదే ప్రభుత్వం.
కానీ కొన్ని కులాలను అవసరంలేదు అన్నట్లుగా పక్కన పెట్టడం ఒక్క జగన్ కే చెల్లింది అన్న చర్చ లోతుగా సాగుతోంది. ఉమ్మడి, అవశేష ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కమ్మ కులం డామినేటింగ్ రోల్ ప్లే చేస్తోంది. స్వాతంత్రం రాక పూర్వం జస్టిస్ పార్టీలో కూడా ఆ కులం వారు ఆధిపత్యం వహించారు అని ఇప్పటికీ నేతలు చెబుతుంటారు. ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉమ్మడి ఏపీలోనూ కమ్యూనిస్టు పార్టీల్లో కమ్మలు నాయకత్వం వహించి కాంగ్రెస్ కి పెను సవాల్ చేశారు. ఆంధ్రాలో తొలి రెండు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేటంతగా కమ్యూనిస్టులు ఊపు ఉండేది. వాటి వెనకాల నాయకత్వం కమ్మలదే అన్నది ఇక్కడ చెప్పుకోవాలి. తరువాత కాలంలో కమ్యూనిస్టులు రెండు పార్టీలుగా విడిపోవడంతో వారి ప్రాభవం తగ్గింది.అనంతర కాలంలో కాంగ్రెస్ లో కమ్మలు తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వచ్చారు. అలా రెండు దశాబ్దాల పాటు రెడ్ల ఆధిపత్యం ఉన్న కాంగ్రెస్ లో తమదైన రాజకీయ వాటా కోసం కమ్మలు గట్టిగానే పోరాడారు.
నాలుగు దశాబ్దాల ఆధిపత్యానికి తెర
తెలుగుదేశం పార్టీతో కమ్మలు తమ రాజకీయ ఆధిపత్యాన్ని, రాజ్యాధికారం కలను సాధించుకున్నారు. నాదేండ్ల భాస్కరరావు పార్టీలో పెట్టాలని ఆలోచిస్తున్న సమయంలో గోదాలోకి దిగిన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కమ్మ సామాజిక వర్గీయులకు రాజకీయ వేదికను అందించారు. విపక్షంలో ఉన్న కీరోల్ పాత్ర వహించే చాన్స్ అందించారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కమ్మల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిపోయింది. అటు అధికార పక్షంలో ఒకే ఒక మంత్రి పదవి ఇచ్చి సీఎం జగన్ చేతులు దులుపుకున్నారు. తాజా మంత్రివర్గ విస్తరణలో కమ్మలకు ప్రాతినిధ్యం లేకుండానే చేశారు. దీంతో ఏపీ రాజకీయ చరిత్రలో అయిదు దశాబ్దాల తరువాత కమ్మ మంత్రి లేని తొలి క్యాబినెట్ కొలువుదీరింది.
అసలు ఇంతకీ ఎందుకిలా అంటే పెద్ద వ్యూహమే అన్నట్టు కథ నడిచిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. 2019 ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం కొంతవరకూ వైసీపీ వైపు మొగ్గు చూపింది. మెజార్టీ వర్గం టీడీపీలో కొనసాగగా.. అప్పటి ప్రభుత్వంపై అసంత్రుప్తితో ఉన్న వారు మాత్రం వైసీపీకి ఓటు వేశారు. దాని ఫలితంగానే కమ్మ కుల ప్రాబల్యమున్న క్రిష్ణ, గుంటూరు జిల్లాల్లో కూడా మెజార్టీ స్థానాలు వైసీపీనే దక్కించుకుంది. కానీ కొద్దిరోజుల్లో ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించడం, కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేయడం, వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడంతో దూరమవుతూ వచ్చారు. గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల నాటికి దాదాపు 80 శాతం కమ్మ సామాజికవర్గం తిరిగి టీడీపీకి టర్న్ అయ్యింది. అందుకే కమ్మలు ప్రాబల్యమున్న చోట వైసీపీకి ఎదురుగాలి వీచింది. దాదాపు కమ్మ కులం సంఘటితమైందని తెలుసుకున్న జగన్ 2024 ఎన్నికల నాటికి ఆ సామాజిక ఓట్లు రావని తెలుసుకొని ఆ వర్గానికి మంత్రి పదవి ఇవ్వకుండా మొండి చేయి చూపారు.
రాజకీయ వైషమ్యాలు రెచ్చగొట్టి
కోస్తా జిల్లాలలో కమ్మలకు, కాపుల మధ్య, కొన్ని చోట్ల బీసీలతో వైరుధ్యాలు ఉన్నాయి. విజయవాడలో సామాజిక నేపథ్యం అందరికీ తెలిసిందే. ఇక ఎస్సీలు ఇతర బడుగు వర్గాలకు పెద్ద పీట వేయడం ద్వారా తమ ఓటు బ్యాంక్ ని పెంచుకుంటూనే యాంటీ కమ్మ బ్రాండ్ తో లబ్ది పొందాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.ఆధిపత్య కులాల మీద అణగారిన వర్గాలకు ఉన్న ఒక రకమైన భావననను సొమ్ము చేసుకోవడంలో భాగమే ఈ వ్యూహం.
ఇప్పటికే జగన్ దిగిపోవాలని కమ్మ సామాజికవర్గంలోని పెద్దలు గట్టిగా కోరుకుంటున్నారు. దాని కోసం ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టారు. టీడీపీని బలోపేతం చేయడంతో పాటు అన్ని వర్గాలను టీడీపీ గూటికి తేవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. యాంటీ కమ్మ స్టాండ్ అన్నది వైసీపీకి కలసి వస్తుందా. అలా జరిగితే ఎంతవరకూ అది ప్లస్ అవుతుంది అన్న చర్చ ఒక వైపు ఉంది. మరో వైపు చూస్తే ఇప్పటిదాకా దక్షిణాదిలో లేని ఈ ట్రెండ్ ని క్రియేట్ చేయడం ద్వారా సామాజిక వైషమ్యాలకు తెర తీసినట్లు అవుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా ఇంతకాలం ముసుగులో గుద్దులాట లాంటి ఒక విషయాన్ని ఇపుడు వైసీపీ బాహాటం చేసింది. దాని పర్యవసానం ఎలా ఉంటుందో 2024 వరకూ ఆగి చూడాల్సిందే.
Web Title: Interestingly there is no representation to kamma and raju social groups in the cabinet
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com