Telangana Assembly Session 2023
Telangana Assembly Session 2023: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సభ లోపల ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ముఖ్యమైన మంత్రి కేటీఆర్.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీటు వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలుకరించి ఆలింగనం చేసుకున్నారు. ఒకరినొకరు హత్తుకున్నారు. పది నిమిషాలపాటు ఇరువురు మాట్లాడుకున్నారు. ఈ ఆసక్తికర సన్నివేశానికి సబంధించిన ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సాయన్నకు నివాళి..
కాగా అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు సభ నివాళులర్పించింది. సాయన్న మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సాయన్న లేనిలోటు తీర్చలేనిదన్నారు. కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలపాలని ఆయన ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. సాయన్న అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన నేత అని అన్నారు. సాయన్న కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మిగిలిన సభ్యులు కూడా సాయన్న మృతిపట్ల సంతాపం తెలుపుతూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని సభా వేదికగా పంచుకున్నారు. అనంతరం సాయన్న మృతికి శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది.
కేటీఆర్ పలకరింపుపై చర్చ..
ఇక కేటీఆర్ సభలో ఈటల వద్దకు వెళ్లి పకలరించడం, కౌగిలించుకోవడంపై అటు బీజేపీలో, ఇటు బీఆర్‌ఎస్‌లో చర్చ మొదలైంది. కేసీఆర్‌ను ఈటల రాజేందర్ బహిరంగంగా తిడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచే పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ప్రభుత్వ చర్యలను ఎండగడుతున్నాడు. ఇక కేటీఆర్ మాత్రం.. తన తండ్రిని తిడుతున్న ఈటల వద్దకు వెళ్లి కౌగిలించుకోవడం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఆశ్చర్యానికి గురిచేసింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈటలతో మాట్లాడడాన్ని సహించని కేసీఆర్ తన కొడుకు కేటీఆర్‌ను మాత్రం పల్లెత్తు మాట అనకపోవడం గమనార్హం. ఇక ఈ కౌగిలింత వెనుక ఏదైనా ఆంతర్యం ఉందా అన్న చర్చ ఇప్పుడు బీజేపీలో జరుగుతోంది. ఒకవైపు బీజేపీ ఈటలకు కీలక పదవులు, బాధ్యతలు అప్పగిస్తోంది. ఈ క్రమంలో ఈటలను కావాలనే కేటీఆర్ ఇలా చేశాడని చాలా మంది అనుకుంటున్నారు. మీడియాలో చర్చకు తెరలేపేందుకు.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలా చేశాడని పేర్కొంటున్నారు.
Telangana Assembly Session 2023
కేటీఆర్‌తో జగ్గారెడ్డి భేటీ..
మరోవైపు సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఆయన చాంబర్‌కు వెళ్లి మాట్లాడారు. ఇప్పుడు ఇది కూడా కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది. కొన్ని రోజులుగా జగ్గారెడ్డి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా కేటీఆర్‌ను కలవడం ఇప్పుడు కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది.