Indian Air Force: ఇండియన్ సైన్యం మూడు విభాగాలుగా విభజించబడింది. ఒకటి ఆర్మీ, రెండు నేవీ. మూడు ఎయిర్ ఫోర్స్. త్రివిధ దళాలే మన దేశానికి రక్ష. ప్రస్తుత భారత సైన్యంలో మొత్తం సుమారు 25 లక్షల మంది ఉన్నారు. ఇందులో 12 లక్షల మంది రిజర్వ్ సైన్యం. ఈ సైన్యం అవసరమయినపుడు మాత్రమే రంగంలోకి దిగుతుంది. కొన్ని దేశాలో ఉన్న ప్రతీ యువకుడు తప్పనిసరిగా ఆర్మీలో పని చేయాలన్న నియమం, భారతదేశంలో లేదు. స్వచ్ఛందంగా ఆసక్తి గలవారు మాత్రమే ఆర్మీలో చేరవచ్చు. ఐక్యరాజ్య సమితి చేపట్టిన ఎన్నో కార్యకలాపాలలో, ముఖ్యంగా శాంతి పరిరక్షణలో భారత సైనిక దళం పాలు పంచుకుంటుంది. ఇక మన సైనిక శక్తి చూసే మన పొరుగున ఉన్న పాకిస్తాన్, చైనా మనకు భయపడుతున్నాయి. సైనిక శక్తితోపాటు మనదగ్గర శక్తివంతమైన ఆయుధాలు కూడా ఉన్నాయి. అత్యాధునికమైన ఫైటర్ జెట్‌లు ఉన్నాయి. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వైమానిక స్థావరంలో తరంగ్ శక్తి–2024 కార్యక్రమం ప్రారంభమైంది. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, అమెరికా, గ్రీస్, బంగ్లాదేశ్, సింగపూర్, యుఏఈలకు చెందిన యుద్ధ విమానాలు ప్రదర్శనలో పాల్గొంటాయి. ఈ నేపథ్యంలో భారత వైమానిక దళంలోని కొన్ని ప్రత్యేక యుద్ధ విమానాల గురించి తెలుసుకుందాం..
సుఖోయ్–30..
భారత వైమానిక దళంలోని సుఖోయ్–30 ఎంకేఐ విమానం 3000 కి.మీ దూరం వరకు దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. రెండు ఏఎల్–31 టర్బోఫ్యాన్ ఇంజిన్ల సహాయంతో 2600 కి.మీ వేగంతో గాలిలో ఎగురుతుంది. ఈ విమానం గాలిలోనే ఇంధనాన్ని నింపుకోగలదు. జెట్‌లో అనేక రకాల బాంబులు, క్షిపణులను ఉంచవచ్చు.
మిరాజ్ 2000
భారతదేశంలోని అత్యుత్తమ యుద్ధ విమానాల్లో ఇది ఒకటి. ఇది ఒకేసారి 1550 కి.మీ దూరం వరకు వేగంగా ప్రయాణించగలదు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఫైటర్ జెట్‌లలో ఒకటైన ఈ విమానం నిమిషానికి 125 రౌండ్లు కాల్పులు జరపగలదు. బాలాకోట్ వైమానిక దాడిలో మిరాజ్ పాకిస్తాన్‌లోని అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.
ఫైటర్ జెట్..
వైమానిక దళానికి చెందిన ఈ ఫైటర్ జెట్ యుద్ధ సమయంలో శత్రు విమానాలను జామ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది కాశ్మీర్ లోయలో అన్ని అవసరాలను కూడా తీరుస్తుంది. ఇది సుదూర ఎయిర్–టు–ఎయిర్ క్షిపణులు, నైట్ విజన్‌తోపాటు ఎయిర్ టు ఎయిర్ ఇంధనం నింపే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
తేజస్..
గూఢచర్యం, నౌకల నిరోధక ఆపరేషన్ కోసం హెచ్‌ఏఎల్– తేజస్ ను వైమానిక దళం కోసం తయారు చేశారు. దీని బరువు 6,500 కిలోగ్రాములు. ఇది ఒకేసారి 10 లక్ష్యాలను ట్రాక్ చేయడంతో పాటు వాటిపై దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. తేజస్‌కు టేకాఫ్ కోసం పెద్ద రన్‌వే కూడా అవసరం లేదు. ఈ యుద్ధ విమానం 36 వేల అడుగుల నుండి 50 వేల అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు. నిమిషంలో 50 వేల అడుగుల ఎత్తుకు అత్యంత వేగంతో చేరుకుంటుంది. దీని వేగం గంటకు 2,222 కి.మీ. ఇది గాలి నుండి గాలిలోకి క్షిపణి దాడి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఒకేసారి 2000 నాటికల్ మైళ్ల దూరం వరకు ఎగురుతుంది.
గజ్వార్ జెట్..
ఈ విమానం 36 వేల అడుగుల ఎత్తులో గంటకు 1700 కిలోమీటర్ల వేగంతో ఎగరగలదు. సముద్ర మట్టం వద్ద దీని గరిష్ట వేగం గంటకు 1350 కి.మీ. భారతదేశం వద్ద 139 జాగ్వార్ జెట్‌లు ఉన్నాయి.