Mutthi Reddy Daughter Bhavani Reddy: ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే. ఉద్యమ సమయం నుంచే చాలా రూడ్ క్యారెక్టర్. అప్పట్లో కెసిఆర్ కు ఆర్థిక సహాయం చేశాడు. కాబట్టి అతడు చేసే ఆగడాలు చూస్తున్నాడు. అడ్డుకునేంత సీన్ ఆయనకు లేదు. నాడు ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉప్పల్, జనగామ నియోజకవర్గాల్లో బతికి బట్ట కట్టింది అంటే దానికి కారణం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డే. అప్పటినుంచే కెసిఆర్ ముత్తిరెడ్డిని నెత్తిన పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అది మరింత ఎక్కువైంది. జనగామ ప్రాంతం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సామంతరాజ్యమైంది. పైగా కేసీఆర్ ఆశీస్సులు ఉండడంతో యాదగిరి రెడ్డి మరింత రెచ్చిపోయాడు. జనగామలోని ఊర చెరువు ప్రాంతాన్ని చెరపట్టాడు. హరీష్ రావు జిల్లా లోని చేర్యాల ప్రాంతాన్ని అతలాకుతలం చేశాడు. అతడి భూ దాహానికి చెరువు మత్తడి హారతి కర్పూరమైంది. అయితే ఇక్కడ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తాను కబ్జా చేసిన స్థలాలు మొత్తం తన కూతురు తుల్జా భవాని రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇదే అతడికి, అతని కూతురికి మధ్య గ్యాప్ పెరిగేందుకు కారణమైంది.
వాస్తవానికి భవాని రెడ్డి పేదల సొమ్ము నొక్కేయాలనుకునే బాపతు కాదు. తండ్రి లాగానే ప్రభుత్వ ఆస్తులను అడ్డగోలుగా ఆక్రమించి తన పేరు మీద చేసుకోవాలి అనుకునే రకం కూడా కాదు. ఉన్నత విద్యావంతురాలు, భర్త కూడా బాగా చదువుకున్నవాడు కావడంతో వారిద్దరూ మంచి మంచి కొలువుల్లోనే స్థిరపడ్డారు. వారు ఉంటున్న ప్రాంతంలో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని వినికిడి. తన తండ్రి ఆక్రమించిన ఆస్తుల వల్ల తాను పలు మార్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడంతో తుల్జా భవాని రెడ్డిలో ఆగ్రహం పెరిగిపోయింది. ఒకసారి తండ్రిని మందలించింది. అయినప్పటికీ ఆయన ప్రవర్తన తీరులో మార్పు రాలేదు. మల్లొకసారి మొన్న జరిగిన హరితహారం కార్యక్రమం లోనూ చెడామడా తిట్టింది. అంతేకాదు తనకు ఆ స్థలంతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఎపిసోడ్ ఇక్కడితోనే ముగిసిపోలేదు.
నిన్న చేర్యాల వెళ్లిన తుల్జా భవాని రెడ్డి తన తండ్రి ఆక్రమించి, తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన స్థలంలో నిర్మించిన గోడలను స్థానికుల సహాయంతో కూలగొట్టింది. అంతేకాదు భవిష్యత్తులో ఈ స్థలం మరెవరూ ఆక్రమించకుండా కోర్టుకు వెళ్తానని ప్రకటించింది. వాస్తవానికి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఫామ్ హౌస్ లు నిర్మించుకుంటూ, లిక్కర్ స్కామ్ లు చేసుకుంటూ తరాలకు తరాలు తినేంత సంపాదన సంపాదించుకుంటున్న ఈ తరంలో తుల్జా భవాని రెడ్డి లాంటి క్యారెక్టర్ ఉండటం, పైగా తండ్రికి ఎదురు తిరగడం నిజంగా ఇంట్రెస్టింగ్. ఈమెను చూసి రాజకీయ నాయకుల పుత్ర రత్నాలు, పుత్ర రత్నామణులు చాలా నేర్చుకోవాలి.