Homeజాతీయ వార్తలుMP Abhishek Banerjee: పార్లమెంట్ లో బీజేపీని ఉతికారేశాడు.. మోడీకే చమటలు పట్టించాడు.. ఎవరీ యువ...

MP Abhishek Banerjee: పార్లమెంట్ లో బీజేపీని ఉతికారేశాడు.. మోడీకే చమటలు పట్టించాడు.. ఎవరీ యువ ఎంపీ.? ఏంటా కథ?

MP Abhishek Banerjee: అతడిది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి స్వయానా మేనల్లుడు. అతని పేరు అభిషేక్ బెనర్జీ. మేనత్త పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో.. అతనికి ఎంపీ సీటు త్వరగానే లభించింది. పైగా అతడు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ నేతల మీద దాష్టీకం ప్రదర్శించాడు. అడుగడుగునా దాడులు చేశాడు. ఫలితంగా ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా గెలిచాడు. శారద కుంభకోణంలో ఇతడి పేరు అప్పట్లో ప్రముఖంగా వినిపించింది. పైగా కమ్యూనిస్టు పార్టీ నాయకుల పై వేధింపుల్లో ఇతడు ఆరి తేరాడని అప్పట్లో జాతీయ మీడియాలో ప్రముఖంగా కథనాలు వచ్చాయి. ఎంపీగా గెలిచిన ఇతడు “తన వీపు తనకు కనపడదు” అనే సామెతను నిజం చేసి చూపించాడు. నిండు పార్లమెంట్ లో శుష్క ప్రశ్నలతో గట్టిగా అరిచాడు. సహజంగానే ఒక సెక్షన్ మీడియా ఇతడి వాదనలను హైలెట్ చేసింది. ఇంకేముంది కొన్ని సోషల్ మీడియా గ్రూపులలో ఆ వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ అతడు అడిగిన ప్రశ్నలు ఏంటంటే ..

నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బిజెపి లో ఒక మైనార్టీ పార్లమెంటు సభ్యుడు కూడా లేడట? ఇటీవల ప్రకటించిన మంత్రి వర్గంలో ఒక మైనార్టీ కి కూడా మంత్రిగా అవకాశం ఇవ్వలేదట? అంటే బంగ్లాదేశ్ లో ముస్లింలకు తమ రాష్ట్రం లో షెల్టర్ ఇస్తామని తన అత్త మమతా బెనర్జీ చెప్పినట్టుగా మోదీ కూడా తన మంత్రివర్గాన్ని మైనార్టీలతో నింపేయాలా? అదేనా ఈ యువ ఎంపీ పార్లమెంట్ లో చెప్పేది? ఇప్పటికే బెంగాల్ రాష్ట్రం రోహింగ్యా లతో నిండిపోయింది. ఇటీవల మొహర్రం వేడుకల్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు, రోహింగ్యాలతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కిటకిటలాడింది. కొన్ని ప్రాంతాలను ఏకంగా బంగ్లాదేశ్, రోహింగ్యాలు ఆక్రమించుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ అటు కేంద్రంగాని, ఇటు బెంగాల్ రాష్ట్రం గాని పట్టించుకోవడం లేదు. పైగా బెంగాల్ ప్రభుత్వం అక్రమ వలసదారులకు ఎర్రతి వాచీ పరుస్తోందని ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ పక్కనపెట్టి అభిషేక్ బెనర్జీ నరేంద్ర మోదీ పై విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి ఒక ఎంపీగా, ప్రతిపక్ష పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడిగా అభిషేక్ బెనర్జీకి ప్రధానమంత్రిని విమర్శించే అధికారం ఉంది. దానిని తప్పు పట్టడానికి కూడా లేదు. కానీ విధానపరమైన లోపాలకు సంబంధించి అడగాల్సిన ప్రశ్నలను పక్కనపెట్టి.. కేవలం ఒక సామాజిక వర్గం మెప్పుకోసం ఆ యువ ఎంపీ అడిగిన ప్రశ్న చాలా ఏవగింపుగా ఉన్నాయి.

తన మంత్రివర్గంలో ఎవరు ఉండాలనేది ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఇష్టం. పార్లమెంటు ఎన్నికల్లో తన పార్టీ తరఫున ఎవరు పోటీ చేయాలనేది కూడా నరేంద్ర మోడీ ఇష్టం. “మైనారిటీలకు టికెట్లు ఇవ్వలేదు కాబట్టి మోడీ ఒక సామాజిక వర్గం ద్రోహి, మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి మోడీ లౌకికవాది కాదు అన్నట్టుగా” అభిషేక్ బెనర్జీ సంధించిన ప్రశ్నలున్నాయి. వాస్తవానికి త్రిబుల్ తలాక్ వంటి దుర్మార్గమైన చట్టం నరేంద్ర మోడీ ప్రభుత్వంలోనే రద్దయింది. కానీ ఈ విషయాన్ని అభిషేక్ బెనర్జీ గుర్తించడు. పార్లమెంట్లో ప్రకటించలేడు. ఎందుకంటే చాందసవాదులకు వ్యతిరేకంగా మాట్లాడితే ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే అవకాశం ఉండదు కాబట్టి.. “అయోధ్య కట్టినా బిజెపి అక్కడ ఎందుకు ఓడిపోయింది? విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎందుకు తగ్గుతున్నాయి? నిత్యావసరాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? బడ్జెట్ కేటాయింపుల్లో కొన్ని రాష్ట్రాలకే ఎందుకు సింహభాగం దక్కుతోంది? బడా వ్యాపారవేత్తలకు చేస్తున్న మేళ్ల మాటేమిటి?” ఇలా అడగాలంటే బోలెడు ప్రశ్నలున్నాయి. మోదీ ని ఇరకాటంలో పెట్టేందుకు ఎన్నో మార్గాలున్నాయి. కానీ, ఆ కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ లాగే, ఈ యువ ఎంపీ అభిషేక్ బెనర్జీ వ్యవహార శైలి ఉంది. ఎంతైనా ఇండియా కూటమి కదా.. ఆ మాత్రం ఉంటుందనుకుంటా..

ఈ యువ ఎంపీ పార్లమెంట్లో గట్టిగా మాట్లాడి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయి ఉండవచ్చు గాక.. చేతిలో రకరకాల పేపర్లు పట్టుకొని ఎంతో లెగ్ వర్క్ చేసిన ఎంపీ లాగా ఫోజ్ కొట్టి ఉండవచ్చు గాక. కానీ తన రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు, తన అత్త ఏలుబడిలో పెరిగిన దాడులు, ప్రతిపక్షాలపై పెడుతున్న కేసులు బయటి ప్రపంచానికి తెలియదనుకుంటే ఎలా? అందుకే అంటారు మన వీపు మనకు కనబడదని.. పాపం ఈ యువ ఎంపీ కి ఎప్పుడు తత్వం బోధపడుతుందో?!

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version