Industrial Development In Telangana: పారిశ్రామిక రంగంలో దేశానికి రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని కేటీఆర్ పదేపదే చెప్పే మాటలన్నీ అబద్ధాలేనా? ప్రభుత్వం వెల్లడిస్తున్న లెక్కలన్నీ ఫేకేనా? అంటే ఇందుకు మూత పడుతున్న పరిశ్రమలు, రోడ్డున పడుతున్న యజమానులు చెబుతున్న మాటలే నిదర్శనం. రాష్ట్రంలో వ్యవసాయం, ఐటీ తర్వాత ఆ స్థాయిలో ఉపాధి కల్పిస్తోంది ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, మధ్య తరహా) పరిశ్రమలే. రాష్ట్రంలో 26.05 లక్షల ఎంఎస్ఎంఈ లు ఉండగా.. వీటిల్లో 25.94 లక్షలు సూక్ష్మ పరిశ్రమలే. వీటి ద్వారా 40.16 లక్షల మందికి ఉపాధి దొరుకుతున్నది. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదకశక్తి లా ఉన్న ఈ పరిశ్రమలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కనీసం రాయితీలు ఇవ్వకపోవడంతో పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఒకప్పుడు వందల మందికి ఉపాధి కల్పించిన యజమానులు ఇప్పుడు తమ ఉపాధి కోసం రోడ్డెక్కుతున్నారు. పరిస్థితి ఇంత దుర్భరంగా ఉన్నా పారిశ్రామిక ప్రగతిలో మేము దేశానికే ఆదర్శం అని మంత్రి కేటీఆర్ చెబుతుండడం గమనార్హం.

…
కరోనా దెబ్బ కొట్టింది
…
కరోనా మొదటి, రెండు దశల్లో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితులు ఉండటం, దేశంలో లాక్ డౌన్ విధించడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. దీనికితోడు కరెంట్ బిల్లులు, అద్దెలు చెల్లించాల్సి రావడంతో యజమానుల పై భారం పడింది. ఇలాంటి అత్యవసర పరిస్థితిలో కేంద్రం పరిశ్రమలకు పదివేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. కానీ బ్యాంకర్లు రుణాలు ఇవ్వడంలో విముఖత ప్రదర్శిస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పరిశ్రమల యజమానులు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం యజమానులు నిరీక్షించి నిరీక్షించి ఇక చేసేది ఏమీ లేక పరిశ్రమలు మూత పెడుతున్నారు.
…
కేటీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదు?
…
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. గత ఎనిమిదేళ్లుగా ఆ శాఖను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఐటీ లో మేం మేటి, పరిశ్రమల్లో మేం సాటి అని మాట్లాడే కేటీఆర్.. వాస్తవ పరిస్థితిని దాచి పెడుతున్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్, కాటేదాన్, చర్లపల్లి, యాప్రాల్ వంటి పారిశ్రామిక వాడల్లో సూక్ష్మ తరహా పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. వీటి ద్వారా సాలినా ప్రభుత్వానికి ₹ వేల కోట్ల ఆదాయం వస్తోంది. అయినప్పటికీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే ఉంది. కరోనా దెబ్బకు కకావికలమైన పరిశ్రమలకు ₹ 3,000 కోట్ల రాయితీలు ఇస్తే ఒడ్డున పడతాయని యజమానులు చెప్పినా ప్రభుత్వం చెవికి ఎక్కడం లేదు.
Also Read: Telangana Intermediate Results: తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై గందరగోళం ఎందుకు?
…
టీఎస్ హెచ్ఐసీ ఏర్పాటు చేసినా
…
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు తీసుకున్న రుణాలను వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ వాయిదాల్లో ఏమైనా అవాంతరాలు తలెత్తితే ప్రభుత్వం 90 రోజులు గరిష్ట గడువు విధిస్తుంది. ఒకవేళ ఈ గడువులో కూడా రుణాలు చెల్లించని పక్షంలో బ్యాంకులు ఆ పరిశ్రమలను ఎన్పీఏ ( నిరర్ధక ఆస్తులు) ప్రకటిస్తాయి. ఇలా ప్రకటించాకా 30 రోజుల్లో రుణం చెల్లించాలి. లేకుంటే పరిశ్రమలకు తాళం వేస్తుంది. ఇలా రాష్ట్రంలో 5 వేల పరిశ్రమలు మూత పడ్డాయి. కేంద్రం ₹10,000 కోట్ల రాయితీ ఇచ్చినా రాష్ట్రం చొరవ తీసుకోకపోవడం దారుణం. ఇక ఎంఎస్ఎంఈల కోసం రాష్ట్రం టీఎస్ హెచ్ ఈసీ ని ఏర్పాటు చేసినా ఉపయోగం లేదు. ఈ సంస్థ అలంకార ప్రాయంగా ఉండటంతో యజమానులు దరఖాస్తులు చేసుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. కనీసం ఈ సంస్థకు రూపాయి కూడా ఇవ్వక పోవడంతో దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు.
…
కార్పొరేట్ కే జై
…
ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న “మన ఊరు మనబడి” కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో సూక్ష్మ తరహా పరిశ్రమల్లో తయారయ్యే సామగ్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ₹3,500 కోట్లకు టెండర్లు పిలిచింది. కానీ ఆర్డర్లు ఆ పరిశ్రమలకు ఇవ్వకుండా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టింది. దీనిపై యజమానులు కేంద్రానికి ఫిర్యాదు చేయగా ప్రస్తుతం ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇక రాష్ట్రంలో సూక్ష్మ తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక మెంటార్ షిప్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ప్రకటించినా అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఇక వరంగల్ రూరల్ జిల్లా పరకాల లోని కాకతీయ టెక్స్టైల్ పార్కులో ఎంఎస్ఎంఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 500 సూక్ష్మ తరహా పరిశ్రమలకు స్థలం కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. కార్పొరేట్ సంస్థలకు భారీ రాయితీలు ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఉన్న పరిశ్రమలు మూతపడుతుంటే మాత్రం చోద్యం చూస్తుందని వాటి యజమానులు ఆరోపిస్తున్నారు. ఎలన్ మస్క్ మీద ఉన్న ఆసక్తి మా మీద లేదని ఆవేదన చెందుతున్నారు.
Also Read: Sharwanand: ఎగబడిన నిర్మాతలు దూరమయ్యారు.. హీరోకి బ్యాడ్ టైం స్టార్ట్ !
[…] […]