దేశ జనాభా పెరుగుతోంది. ప్రపంచంలో మనమే నెంబర్ వన్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికి చైనా మొదటి స్థానంలో ఉన్నా దాన్ని అధిగమించే స్థాయిలో మనమున్నాం. జనాభా ఇలాగే పెరిగితే తీవ్ర పరిణామాలుంటాయని శాస్ర్తవేత్తలు ఓ వైపు మొత్తుకుంటున్నా పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా కాలుష్యం పెరిగిపోతోంది. దీని ద్వారా అన్ని రంగాలు కుదేలవుతున్నాయి.
అయినా ప్రభుత్వాల్లో చలనం లేకుండా పోతోంది. కుటుంబ నియంత్రణపై దృష్టి సారించకపోవడంతోనే ఈ విపరీతాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. తాజా లెక్కల ప్రకారం మనదేశంలో జనాభా 133.89 కోట్లకు చేరింది. నిమిషానికి 51 శిశువులు పుడుతుంటే 16 మంది కన్ను మూస్తున్నారు. మొత్తం మీద నికరంగా దేశ జనాభాలో నిమిషానికి 35 మంది అదనంగా కలుస్తున్నారు.
2019 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు దేశం మొత్తం మీద నమోదైన జనన, మరణాల లెక్కల ఆధారంగా 2019 డిసెంబర్ 31 నాటికి దేశ జనాభా తాజా వివరాలను జన గణన విభాగం విడుదల చేసింది. ఏడాది వ్యవధిలో దేశంలో 2.67 కోట్ల మంది శిశువులు జన్మించగా మరణాలు 83 లక్షలున్నాయి. దేశంలో నమోదైన జననాల్లో81.2 శాతం ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగాయి.
మొత్తం మీద 83.01 లక్షల మరణాల్లో 34.5 శాతం మందికి మరణించే సమయంలో ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు. ఇవన్ని సహజ మరణాలుగా నమోదయ్యాయి. ఆస్పత్రుల్లో చేరి వైద్యం పొందుతూ సంభవించిన మరణాలు 32.1 శాతమున్నాయి. ఇతర కారణాలతో మిగతా మరణాలు వాటిల్లాయి. పుట్టిన వెంటనే కన్నుమూసిన శిశు మరణాలు 1,65,257 కాగా ఇందులో 75.5 శాతం పట్టణాల్లో, మిగిలిన 24.5 శాతం గ్రామీణ ప్రాంతాల్లో జరిగాయి.
దేశంలో జనన, మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కేవలం 20 సంత్సరాల వ్యవధిలోనే 118 శాతం అదనంగా జననాలు పెరిగాయి. ఉదాహరణకు 1999లో దేశంలో1.22 కోట్ల మంది పుడితే 2019 సంవత్సరంలో అంతకన్నా మరో 118 అదనంగా పెరిగి 2.67 కోట్ల మంది పుట్టడం గమనార్హం. ఇదే కాల వ్యవధిలో మరణాలు ఏకంగా 129 శాతం పెరిగి 36.23 లక్షల నుంచి 83 లక్షలకు చేరడం తెలిసిందే.