ఇప్పటి వరకు కరోనా వైరస్ కు మందు లేదన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ తోనే రక్షణ అని ప్రపంచం నిర్ణయానికి వచ్చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలు.. అన్ని దేశాలూ వ్యాక్సినేషన్లో బిజీగా ఉన్నాయి. అయితే.. వాటి సమర్థ ఎంత అన్న విషయంలో స్పష్టమైన క్లారిటీ లేదనే చెప్పాలి. కరోనాను ఎంత మేర వ్యాక్సిన్ ఎదుర్కొంటుంది? అన్నప్పుడు క్లియర్ కట్ గా ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి. ఏదో శాతాల వారీగా అంత మేర.. ఇంత మేర ప్రభావం చూపుతుందని చెప్పడమే కొనసాగుతోంది.
అయితే.. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు మాత్రం.. కరోనాపై తమ వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికన్లు త్వరలోనే మాస్కులను విసిరికొట్టే రోజు రాబోతోందని స్వయంగా అధ్యక్షుడు బైడెన్ ఆ మధ్యనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచలోని అగ్రదేశాల పరిస్థితి అలా ఉంటే.. ఇండియా పరిస్థితి మాత్రం ఇంకా ఇబ్బందికరంగానే ఉండడం గమనార్హం. అంతేకాదు.. సరికొత్త సర్వే ఫలితాలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీ బాడీస్ ఎలా ఉన్నాయి..? అవి కరోనాపై ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయి..? అనే విషయమై ఐసీఎంఆర్ చేపట్టిన రీసెర్చ్ ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాలు ఆందోళన కలిగించేవిగా ఉండడం గమనార్హం. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఏకంగా 76 శాతం మందికి కొవిడ్ సోకినట్టు గుర్తించడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది.
ఇండియాలో వేస్తున్న వ్యాక్సిన్లను తాము గుర్తించబోమంటూ పలు దేశాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా ఈ సర్వే ఫలితాలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారిలోనూ 76 శాతం మంది వైరస్ బారిన పడితే.. ఇక వ్యాక్సిన్ సమర్థత ఎక్కడ ఉన్నట్టు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
అసలే.. డెల్టా ప్లస్ అత్యంత ప్రమాదకరమని డబ్ల్యూహెచ్ వో సహా..నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ప్రభావం పెద్దగా లేదనే సంకేతాలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా.. కొవాగ్జిన్ కారణంగా యాంటీబాడీలు 77 శాతమే అభివృద్ధి చెందుతున్నాయని నిపుణులు గుర్తించినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో.. అప్రమత్తంగా ఉండడం తప్ప చేయాల్సింది ఏమీలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.