
ఆశకు అంతుండదు.. అక్రమానికి లెక్కుండదు. ఇవి శృతిమించినప్పుడు జరిగే దారుణాలు ఊహాతీతంగా ఉంటాయి. గుప్తా బ్రదర్స్ గా పేరుగాంచిన.. ముగ్గురు భారతీయ సోదరులతో కలిసి చేసిన అక్రమానికి సౌతాఫ్రికా అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతేకాదు.. తాజాగా అరెస్టు కూడా అయ్యారు. దీంతో.. ఆయన మద్దతు దారులు ఆ దేశంలో రెచ్చిపోయి విధ్వంసం సృష్టిస్తున్నారు. మరి, దీని వెనకున్న అసలు కథ ఏంటీ? ఈ భారతీయ సోదరులు ఎవరు? ఏం జరిగింది? అన్నది చూద్దాం.
ఉత్తరప్రదేశ్ లోని సహరన్ పుర్ అనే గ్రామానికి చెందిన శివకుమార్ గుప్తా ఓ చిన్న రేషన్ డీలర్. ఆయనకు ముగ్గురు కొడుకులు. వారు అజయ్, అతుల్, రాజేశ్. వీరిలో రెండోవాడు అతుల్ 1993లో సౌతాఫ్రికా వెళ్లి చెప్పుల దుకాణం పెట్ఉకున్నాడు. అక్కడి నుంచి వీరి రాత మారిపోయింది. వ్యాపారం జోరుగా సాగడంతో.. కంప్యూటర్ అసెంబ్లింగ్ బిజినెస్ మొదలు పెట్టాడు. దీంతో.. భారీగా సంపాదన మొదలైంది. ఈ క్రమంలోనే మండేలా పార్టీ ఆఫ్‌రికన్ నేషనల్ కాంగ్రెస్ నేతలతో పరిచయం మొదలైంది.
మండేలా పార్టీ డిప్యూటీ థాబో ఎంబెకీ సహచరుడు.. ఎసోప్ పహాద్ తో మొదలైన పరిచయం వీళ్లను ఎక్కడికో తీసుకెళ్లింది. నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా తర్వాత డిప్యూటీగా ఉన్న ఎంబెకీ అధ్యక్షుడు అయ్యారు. దీంతో.. ఆయన సహచరుడు పహాద్ ద్వారా.. గుప్తా బ్రదర్స్ ఎంబెకీకి దగ్గరయ్యారు. ఇంకేముందీ.. ప్రభుత్వ కాంట్రాక్టులు, అందులో రాజకీయ వాటాలు సాగిస్తూ.. వేగంగా ఎదిగారు. ఆ తర్వాత యురేనియం గనులు తవ్వే స్థాయికి ఎదిగేశారు. ఆ విధంగా అధ్యక్షుడికి మరింత దగ్గరైపోయారు.
అయితే.. ఇక్కడే గుప్తాలు తమదైన రాజకీయం కూడా చేశారు. అధ్యక్షుడు ఎంబెకీతో దగ్గరగా ఉంటూనే.. అపోజిషన్ పార్టీ అగ్రనేత జుమాతోనూ సంబంధాలు కొనసాగించారు. ఆ తర్వాత కాలంలో జుమా సౌతాఫ్రికా అధ్యక్షుడు అయ్యారు. ఇక, వీరి హవా ఎలా ఉందంటే.. ఏకంగా గుప్తాలు చెప్పిన వారికే మంత్రి పదవులు వచ్చేలా సాగింది. మొత్తంగా దేశ అధ్యక్ష భవనమే వీరి చేతుల్లోకి వచ్చేసింది. 2015లో గుప్తాలు చెప్పిన మనిషిని ఏకంగా ఆర్థిక మంత్రిని చేశారంటే వారి రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
దేనికైనా ఓ మిడ్ పాయింట్ ఉంటుంది. ఆ తర్వాత పతనం మొదలవుతుంది. వీరి అవినీతి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రమాదంలో పడింది. ఇలాంటి సమయంలోనే గుప్తా బ్రదర్స్ నిర్వహించిన పెళ్లి వేడుక ప్రపంచాన్నే తనవైపు తిప్పుకుంది. ఏకంగా భారత్ నుంచి విమానాల్లో బంధువులను తరలించారు. దీంతో.. సౌతాఫ్రికా విపక్షాలు, పౌరసంఘాలు, మీడియా కలిసి గుప్తా బ్రదర్స్ అవినీతిని ఎత్తి చూపడం మొదలు పెట్టాయి. ఈ దుమారం పెరిగి పెద్దదవడంతో.. అధ్యక్షుడు జుమా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ విషయం ముందే పసిగట్టిన గుప్తాలు మూటా ముల్లె సర్దుకొని దుబాయ్ చెక్కేశారు. రాజీనామా చేసిన జుమా మాత్రం జైలు పాలయ్యాడు!