Kashmir: జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత లోయలో ప్రశాంత వాతావరణం కనిపించింది. దీంతో భారతీయులు స్వేచ్ఛగా కశ్మీర్‌కు రాకపోకలు సాగించారు. మరోవైపు విదేశీ పెట్టుబడులు కశ్మీర్‌కు వస్తున్నాయి. అయితే రెండుళ్లుగా కశ్మీర్‌లో మళ్లీ ఉగ్ర కదలికలు పెరిగాయి. కార్యకలాపాలు పెరుగుతున్నాయి. రెండేళ్లలో ఉగ్రవాదుల దాడుల్లో 48 మంది సైనికులు వీరమరణం పొందారు. ఇదిలా ఉంటే.. తాజాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత, త్వరలో కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. లోయలో అశాంతి, అభద్రత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల ఏరివేతకు భారత ఆర్మీ సిద్ధమైంది సర్ప్ వినాశ్ 2.0 పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించింది. గడిచిన 21 ఏళ్లలో సైన్యం చేపట్టిన అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఇదే. దీనిని నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుంది. 55 మంది ఉగ్రవాదులను ఏరివేయడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం. ఇక ఈ ఆపరేషన్‌లో భాగస్వాములైన అధికారులు నేరుగా భద్రతా సలహాదారుకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆపరేషన్ సర్ప్ వినాశ్‌లో భాగంగా 150 కిలోమీటర్ల మేర విస్తరించి.. నిటారుగా ఎక్కడం, దట్టమైన అడవులు, గుహలు వంటి అడ్డంకులను ఎదుర్కొనడం వంటి సవాళ్లు ఉంటాయి. ఇందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధమైంది. విజయమే లక్ష్యంగా పనిచేయబోతోంది. ఉగ్రవాదులను అంతమొందించేందుకు భారత సైన్యం ఆపరేషన్ చేపట్టింది. ఈమేరకు ఉగ్రవాదుల జాబితాను కూడా భారత ఆర్మీ సిద్ధం చేసింది. ఉగ్రవాదుల వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థల జాబితా కూడా రూపొందించింది. రెండేళ్లలో మరణించిన 48 మంది సైనికుల త్యాగాలు వృథా కావొద్దన్న ఉద్దేశంతో, ఉగ్రవాద భయంతో వణుకుతున్న కశ్మీరీల మోములో ఆనందం చూడాలని ఈ ఆపరేషన్ చేపట్టారు.
కీలక ప్రాంతాల్లో మోహరింపు..
ఆపరేషన్ సర్ప్ వినాశ్‌లో భాగంగా సైన్యం కీలకమైన ప్రాంతాల్లో సైనికులను మోహరించింది. 200 మంది స్నైపర్లు, 500 మంది పారా కమాండర్లతోపాటు 3 వేల మంది ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. దేశంలోని ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలను సమన్వయం చేసుకుంటూ ఇండియన్ ఆర్మీ ఈ ఆపరేషన్ నిర్వహిస్తుంది. 1995 నుంచి 2003 మధ్య కాలంలో ఇండియన్ ఆర్మీలో కీలకపాత్ర పోషించిన విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ సహాయం కూడా తీసుకోనుంది. స్థానిక పరిస్థితుల, ఎదురయ్యే సవాళ్లపై వీరికి అవగాహన ఉంది. కీలక ఉగ్రవాదులను హతమార్చడంతోపాటు వారికి ఆహారం, ఆయుధాలు అందించే క్షేత్రస్థాయి నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేయడమే ఈ ఆపరేషన్ టార్గెట్.
హిట్ లిస్ట్‌లో 55 మంది..
ఇదిలా ఉండగా ఇండియన్ ఆర్మీ హిట్ లిస్ట్‌లో 55 మంది ఉగ్రవాదులు ఉన్నారు. వీరి ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా ప్రస్తుతం డోడా, కఠువా, ఉధంపూర్, రాజౌరీ, పూంచ్, రియాసీలో సైనిక చర్య ప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్‌ను ఉగ్రవాద కేంద్రం చేయాలనుకుంటున్న పాకిస్తాన్ ప్రణాళికను ఈ ఆపరేషన్‌తో విచ్ఛినం చేయనుంది ఇండియన్ ఆర్మీ. ఈ ఆపరేషన్‌లో భాగంగా కఠినమైన సవాళ్లు ఏటవాలులు, అనేక గుహలు, సహజ రాతి మార్గాలు, అడవి జంతువులను ఆర్మీ ఎదుర్కొంటుంది.
దట్టమైన అడవుల్లో గుహలు..
ఇదిలా ఉంటే.. కశ్మీర్‌లోని దట్టమైన అడవులు ఉగ్రవాదులకు సహకరిస్తున్నాయి. అడవుల్లో సుమారు వెయ్యి గుహలు ఉన్నట్లు ఆర్మీ గుర్తించింది. వీటిలో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారని భావిస్తోంది. ఈ ఆపరేషన్‌లో మిషన్ లక్ష్యాలను సాధించడానికి స్థానిక బలగాలు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ కలిసి పనిచేస్తాయి.
2003లో ఆపరేషన్ సర్ప్ వినాశ్ 1
ఆపరేషన్ సర్ప్ వినశ్ అనేది జమ్మూ మరియు కాశ్మీర్‌లోని పీర్ పంజాల్ శ్రేణిలోని హిల్ కాకా పూంచ్–సురన్‌కోట్ ప్రాంతంలోని ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించడానికి 2003 ఏప్రిల్, మే నెలల్లో భారత సైన్యం మొదటిసారి చేపట్టింది. క్లిష్టమైన ఈ సైనిక చర్య జమ్మూ కాశ్మీర్‌లో 65 మంది ఉగ్రవాదులను హతమార్చింది. అతిపెద్ద ఉగ్రవాద రహస్య స్థావరాలను కూల్చివేసింది. 9 పారా–ఎస్‌ఎఫ్‌చే హిల్ కాకాలోని పీక్ 3689ని స్వాధీనం చేసుకోవడం ఈ ఆపరేషన్‌లోని కీలక ఘట్టాలలో ఒకటి. అదనంగా, 6 రాష్ట్రీయ రైఫిల్స్, 163వ బ్రిగేడ్, 100వ బ్రిగేడ్ మరియు 15వ కార్ప్స్ వంటి విభాగాలు విస్తృత ఆపరేషన్‌లో ముఖ్యమైన పాత్రలు పోషించాయి.