తూర్పు లడాఖ్‌లోని పరిస్థితి నెలలు గడుస్తున్నా కొలిక్కి రావడం లేదు. ఒకవైపు చర్చలు అంటూనే.. మరో వైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది చైనా. ఇప్పటికే చైనాకు షాకుల మీద షాకులు ఇస్తున్నా.. మన సైన్యాన్ని రెచ్చగొడుతూనే ఉన్నారు. అంతకుమించి మన భూభాగాన్ని ఆక్రమించింది. రెండు కొండలను కైవసం చేసుకుంది. దీనికి దీటుగా భారత్ కూడా చైనా భూ భాగాన్ని ఆక్రమించి సమాధానం ఇచ్చింది. అయినా.. తన వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు.
Also Read: ట్రంప్ కు షాక్: బైడెన్ తరఫున ఒబామా ప్రచారం
‘చైనా ఒక అడుగు ముందుకేస్తే మేము పదడుగులు ముందుకేస్తాం.. అంతే తప్ప ఒక్క అడుగు జాగను కూడా వదులుకోం’ అంటూ ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. చైనా కూడా ఒక అడుగు ముందుకేసి.. రెండడుగులు వెనక్కి వేస్తున్నట్లే కపట బుద్ధి ప్రదర్శిస్తోంది. ఎప్పటికప్పుడు ఎల్‌ఏసీ వద్ద వివాదాలను చర్చలతో పరిష్కరించుకుందామంటూనే.. వాటిని సాగదీస్తూ.. మరిన్ని ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. చైనా ఆగడాలను పసిగడుతున్న భారత్ తనకు దీటైన జవాబు ఇస్తూనే ఉంది.
తూర్పు లడాఖ్‌లోని పాంగాంగ్ సరస్సుకు దక్షిణాన ఉన్న వ్యూహాత్మక శిఖరాలపై భారత్ ఎప్పుడైతే పట్టు సాధించిందో.. అప్పటినుంచి చైనా.. సైన్యం ఉపసంహరణ ప్రక్రియను పక్కనపెట్టి భారత్‌ను అక్కడినుంచి ఖాళీ చేయించడం పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. భారత్‌తో వరుసగా జరుగుతున్న మిలటరీ స్థాయి చర్చల్లో పదేపదే ఈ అంశాన్నే ప్రస్తావిస్తోంది. నిజానికి పాంగాంగ్ ఫింగర్ 4ని ఆక్రమించడమే గాక.. దక్షిణ తీరం వైపు కూడా చొచ్చుకొచ్చే ప్రయత్నం చేయడంతోనే భారత్ ముందుగా అప్రమత్తమై వ్యూహాత్మక శిఖరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. కానీ చైనా మాత్రం సైన్యం ఉపసంహరణకు ఇదే ప్రధాన అడ్డంకిగా మారినట్లు వితండ వాదన వినిపిస్తోంది.
తూర్పు లడాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఏప్రిల్ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. వాటినే కొనసాగించాలని భారత్ చైనాను కోరుతున్నా.. పెద్దగా పట్టించుకోవడం లేదు. చైనా మాత్రం ముందు భారత్ పాంగాంగ్ దక్షిణ తీరంలోని వ్యూహాత్మక శిఖరాలను ఖాళీ చేయాలని కోరుతోంది. గతంలో చేపట్టిన చర్చల్లోనూ చైనా పదే పదే ఇదే అంశాన్నే లేవనెత్తింది. భారత్ కూడా చైనాకు అదే స్థాయిలో దీటుగా బదులిస్తూ వస్తోంది. భారత్ దక్షిణాన వ్యూహాత్మక శిఖరాలను ఖాళీ చేయాలంటే… చైనా పాంగాంగ్ ఉత్తర తీరాన్ని ఖాళీ చేయాలని నిబంధన పెట్టింది. ఇప్పటికే పాంగాంగ్ వివాదాస్పద ఉత్తర తీరాన్ని వంచనతో ఆక్రమించుకున్న చైనా.. దక్షిణ తీరాన్ని కూడా ఆక్రమించుకునే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే భారత్ అక్కడి నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది.
Also Read: జనసేనాని.. బయటకు రావాల్సిందేనా?
చైనా కవ్వింపు చర్యలకు భారత్ కూడా ఎప్పటికప్పుడు దీటుగా బదులిస్తోంది. తాజాగా ఏడు చోట్ల వాస్తవాధీన రేఖను దాటుకుని వెళ్లడం ద్వారా డ్రాగన్‌ను మరింత బెంబేలెత్తించే ప్రయత్నం చేసింది. పాంగాంగ్ ఉత్తర తీరాన్ని ఖాళీ చేయకుండా భారత్ మాత్రం దక్షిణ తీరాన్ని ఖాళీ చేయాలన్న చైనా వితండ వాదనకు దూకుడే సరైన సమాధానమని భారత్ భావిస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు పెట్టిన చైనా.. తాజా చర్చల్లో కూడా.. భారత్ మొదట పాంగాంగ్ దక్షిణ తీరాన్ని ఖాళీ చేయాలని చైనా కోరింది. అయితే భారత్ మాత్రం ఒకేసారి రెండు దేశాలు దక్షిణ, ఉత్తర తీరాలను ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తోందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. చైనాను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మే స్థితిలో లేని భారత సైన్యం కూడా.. అటు చర్చలు జరుగుతున్నా ఇటు సరిహద్దులో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.