Indian Economy: నాలుగు సంవత్సరాలలో భారత్ “తీన్” మార్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థికవేత్తలు గతంలో భారత వృద్ధి రేటు గురించి, ఇతర విషయాల గురించి ఒక అంచనా వేశారు.

Written By: Bhaskar, Updated On : July 28, 2023 1:31 pm

Indian Economy

Follow us on

Indian Economy: ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న దేశంగా భారత్ పేరు గడించింది. ఒకప్పుడు ఏముంది అక్కడ అనే స్థాయి నుంచి ఇప్పుడు అక్కడ అన్నీ ఉన్నాయి అనే స్థాయికి ఎదిగింది. విలువైన మానవ వనరులు, సుభిక్షమైన దేశం, సులభతరమైన అనుమతులు..ఇలా అన్ని రంగాల్లో దేశం వర్ధిల్లుతోంది. మరి ఈ ప్రయాణం ప్రయోజనాలు ఇంతవరకేనా అంటే.. కాదు అంతకుమించి అనేలాగా సంకేతాలు వెలువడుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక వ్యవస్థల అంచనా ప్రకారం 2027 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుంది అని తేలింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థికవేత్తలు గతంలో భారత వృద్ధి రేటు గురించి, ఇతర విషయాల గురించి ఒక అంచనా వేశారు. అప్పట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు వెలువరించిన నివేదిక ప్రకారం భారత్ 2029 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని తేల్చి చెప్పారు. అయితే 2029 కన్నా రెండు సంవత్సరాల ముందే భారత్ ఇప్పుడు ఆ గమ్యాన్ని చేరుతుందని జోస్యం చెప్పారు. అంతేకాదు.. ప్రపంచ వాణిజ్య కూడలిగా మారుతుందని ప్రకటించారు. 2024 ఎన్నికల్లో కూడా విజయం సాధించి తాము మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని, 2029 నాటికి దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వాసం ప్రకటించిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక వేత్తల అంచనాకు ప్రాధాన్యం ఏర్పడింది. ” 2024 సంవత్సరంలో భారత్ ఎంచుకున్న మార్గాన్ని, 2023 చివరి నాటికి వాస్తవిక జీడీపీని పరిగణనలోకి తీసుకున్నట్టయితే 2027 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయం. అంటే ప్రపంచంలో పదవ ఆర్థిక వ్యవస్థగా నిలిచిన 2014తో పోల్చితే ఏడు స్థానాలు పైకి దూసుకుపోతోంది” అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థికవేత్తలు ప్రకటించారు.

ఏ ప్రకారం చూసినా, ఏ ప్రమాణాల ప్రకారం లెక్క గట్టినా భారత్ మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఒక అద్భుత విజయమే అవుతుంది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. కోవిడ్ వంటి పరిణామాలతో ప్రపంచంలోని అన్ని దేశాలు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాయి. భారత్ లో ఇలాంటి పరిస్థితి మరీ అంత తీవ్రంగా లేదు. ఆర్థిక స్తంభాలు బలంగా ఉన్న నేపథ్యంలో దేశం కోవిడ్ ప్రతికూలతల నుంచి త్వరగానే కోలుకుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం బారిన పడినప్పటికీ దాని ప్రభావం భారత్ మీద అంతగా లేదు. సుస్థిరమైన పరిపాలన వ్యవస్థ ఉండడంతో భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ వర్గాల చెందిన వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం కూడా పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడంతో పెట్టుబడులకు గమ్యస్థానం గా మారుతుంది. ఇవన్నీ పరిణామాలు భారత్ ను ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా పరిగణించేందుకు దోహదపడుతున్నాయి.