దేశ ప్రధాని మోదీ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. నేటి అర్ధరాత్రి నుంచి 21రోజులపాటు దేశం మొత్తం లాక్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. సాయంత్రం 8గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతున్నానని ట్వీటర్లో పేర్కొన్నారు. ఆయన ప్రసంగంలో కరోనా కట్టడికి కీలక నిర్ణయాలు తీసుకుంటారని ప్రజలంతా భావించారు. అందుకనుగుణంగా ప్రధాని మోదీ దేశంలోని ప్రతి నగరం, ప్రతీ ఊరు, ప్రతీ వీధిని లాక్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. 21రోజులపాటు ప్రతీ ఇంటికి లక్ష్మణ రేఖ గీయబడిందని ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచించారు.
దేశంలో కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుందని తెలిపారు. దేశ ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రధానిగా కాకుండా మీ ఇంటి బిడ్డగా ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఎవరూ రోడ్లపైకి తిరగొద్దని సూచించారు. ప్రజలంతా ఇళ్లంతా పరిమితం కావాలన్నారు. సామాజిక దూరం పాటించాలన్నారు. కరోనా నివారణకు చేపడుతున్న నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా వైరస్ మొదట్లో కంటే ప్రస్తుతం వేగంగా విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాను అదుపులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందన్నారు.
నిత్యావసర సరుకుల ఎప్పటిలాగానే ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందొద్దని తెలిపారు. కరోనా నివారణ కోసం 15వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వైద్య సిబ్బందికి కరోనాపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే దేశంలో 21రోజులపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రైవేట్ వైద్య సిబ్బంది కూడా ప్రభుత్వానికి సహకరిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మరిని తరిమికొట్టేందుకు ప్రతీఒక్కరూ ప్రభుత్వానికి సహకరిస్తే బయటపడుతామని ప్రధాని స్పష్టం చేశారు. 21రోజులుపాటు ప్రతీఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని.. లేకపోతే 21ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటుందని ప్రధాని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు.