Agni Prime Missile: మనమీద అగ్గిమీద గుగ్గిలం అవుతూ.. మన దేశం మీద అడ్డగోలుగా మాట్లాడుతూ.. మేకపోతు గాంభీర్యాన్ని పాకిస్తాన్ ప్రదర్శిస్తోంది. ఏకంగా సౌదీ అరేబియా తో అంట కాగి.. అణు బాంబులు వేస్తాం జాగ్రత్త అంటూ హెచ్చరిస్తోంది.. పాకిస్తాన్ చేస్తున్న మంగమ్మ శపథా లకు భారత్ పెద్దగా భయపడటం లేదు. అలాగని పాకిస్తాన్ హెచ్చరికలను తేలికగా తీసుకోవడం లేదు. పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇస్తే అనవసరంగా ఆ దేశం స్థాయి పెంచినట్టు అవుతుందని భావించి.. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోతోంది. తాజాగా మన రక్షణ వ్యవస్థ అభివృద్ధి చేసిన మిస్సైల్ నింగిలోకి దూసుకుపోయింది. నిప్పులు చిమ్ముకుంటూ ఆకాశాన్ని తాకింది.
మన దేశ రక్షణ వ్యవస్థలో ఎన్నో మిస్సైల్స్ ఉన్నాయి. వాటన్నింటికి మించి అగ్ని ప్రైమ్ పేరుతో భారత రక్షణ వ్యవస్థ సరికొత్త మిస్సైల్ రూపొందించింది. ఇది 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని సైతం ఫినిష్ చేస్తుంది.. దీనిని లాంచ్ చేయడానికి రైలు ఆధారిత మొబైల్ లాంచర్ ను ప్రయోగించారు. దీనిద్వారా మీసైల్స్ మొత్తాన్ని రైల్వే లైన్లలో దేశంలోని వివిధ ప్రాంతాలకు తక్కువ సమయంలోనే రవాణా చేయడానికి అవకాశం ఉంటుంది. మనదేశంలో ఇప్పటివరకు ఈ తరహా ప్రయోగం చేయడం ఇదే తొలిసారి. శాస్త్రవేత్తలు అనుకున్న దాని ప్రకారమే మిస్సైల్ దూసుకుపోయింది. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి వెళ్లిపోయింది. తద్వారా భారత రక్షణ వ్యవస్థలోకి సరికొత్త కలికి తురాయి చేరింది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అత్యంత ఆధునికమైన ఆయుధాలను.. మిస్సైల్స్ ను సొంతంగా తయారు చేసుకుంటున్నది. అందులో భాగంగానే అగ్ని ప్రైమ్ ను రూపొందించింది. ఇది రెండువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని సైతం ఫినిష్ చేయగలదు అంటే దీని స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు ఇది రైలు లాంచర్ ద్వారా నింగిలోకి వెళ్ళింది. దీనిని మొబైల్ ఆధారంగా కూడా ఆపరేట్ చేయవచ్చు. అంతేకాదు ఒక్కసారి టార్గెట్ లోడ్ చేస్తే చూస్తుండగానే దహనం చేసి వస్తుంది. ఇది విజయవంతం కావడంతో.. దేశ అవసరాలకు తగ్గట్టుగా సరికొత్త పరిజ్ఞానంతో మిస్సైల్స్ తయారు చేస్తామని భారత రక్షణ శాఖ ప్రకటించింది. అంతేకాదు ఇటువంటి మిస్సైల్స్ వల్ల పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలను చూస్తుండగానే కాల్చి వేయవచ్చని రక్షణ శాఖ మాజీ అధికారులు అంటున్నారు.