Andhra Shrimp: అమెరికా అధ్యక్షుడు ట్రంప్( American President Donald Trump) నిర్ణయాలతో ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఆ జాబితాలో ఇండియా కూడా ఉంది. ప్రధానంగా సుంకాల బెడద అనేది ఏపీకి కూడా తాకింది. ముఖ్యంగా ఆక్వారంగానికి కష్టాలు తప్పేలా లేదు. సుంకాల పెంపు నిర్ణయం దశలవారీగా అమలు చేయాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. అందులో భాగంగా భారత్ నుంచి రొయ్యల దిగుమతులకు వ్యతిరేకంగా అమెరికా సనెటర్లు ఇండియా ప్రింప్ యాక్ట్ ను ప్రవేశ పెట్టడంతో ఏపీలోని ఆక్వా రైతులు, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి దారులు నిరాశ చెందుతున్నారు. ఈ యాక్ట్ తో ఏపీ నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలపై టాక్స్లు మరింత పెరగనున్నాయి. దీంతో వాటి ధరను తగ్గించుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఆక్వా రైతులపై ఏర్పడుతుంది.
* ఇప్పటివరకు ఏపీ టాప్..
ఆక్వా( Aqua) రంగానికి సంబంధించి ఎగుమతుల్లో ఏపీ టాప్ గా నిలుస్తోంది. ఏటా ఇరవై వేల కోట్ల ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి అవుతుంటాయి. ఒక్క అమెరికాకే 16 వేల కోట్లు విలువచేసే ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంటారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉత్పత్తి అయ్యే రొయ్య ఎక్కువగా దిగుమతి అవుతుంటుంది. అయితే ట్రంప్ సుంకాల ప్రకటనతో గత కొద్దిరోజులుగా రొయ్య ధర పడిపోయింది. టన్నుకు నలభై వేల రూపాయలకు పైగా నష్టం కొనసాగుతోంది. మున్ముందు ఈ రొయ్య ధర మరింత తగ్గే అవకాశం ఉంది.
* గోదావరి జిల్లాల వాసులకు పెనుముప్పు
ఆక్వా ఎగుమతులపై ట్రంప్ 50% సుంకం విధించడంతో ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని ఆక్వా రైతులు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులు తాజాగా సుంకాల దెబ్బకు తమపై పెను భారం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో రొయ్యల ధరలు మరింత పతనమైతే ఆక్వా రంగాన్ని వదులుకోవాల్సిందేనని చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా అమెరికా సెనట్ లో సుంకాల పెంపునకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టడం.. కచ్చితంగా పన్నులు పెరుగుతాయని భావిస్తున్నారు. అదే జరిగితే అమెరికాకు ఎగుమతులు ఆగిపోవడం ఖాయం. రొయ్యకు దేశీయంగా మార్కెట్ లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు కూడా తలెత్తడం ఖాయమని తెలుస్తోంది. ఈ ప్రతికూల పరిస్థితులను ఏపీలో ఆక్వా రంగం ఎలా గొట్టెక్కుతుందో చూడాలి