Tejas Fighter Jet: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌కు మిత్రులు ఎవరో.. శత్రువులు ఎవరో తేలిపోయింది. ఇదే సమయంలో భారత సైనిక శక్తి ప్రపంచానికి తెలిసింది. ఈ నేపథ్యంలో శత్రువులను ఎదుర్కొనేందుకు భారత్ సైన్యాన్ని మరింత బతోపేతం చేస్తోంది కేంద్రం. ప్రస్తుత యుద్ధాల్లో వైమానిక దళం, డ్రోన్లే కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వైమానిక దళం యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 97 తేజస్ మార్క్-1A ఫైటర్ జెట్లను సమకూర్చేందుకు హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో రూ.66,500 కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం దేశీయ రక్షణ ఉత్పాదనను ప్రోత్సహించడమే కాక, వైమానిక దళం ఆధునికీకరణ లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఆత్మనిర్భర్ లక్ష్యానికి అనుగుణంగా..
తేజస్ మార్క్-1A ఫైటర్ జెట్ భారతదేశ రక్షణ సాంకేతికతలో ఒక మైలురాయి. ఈ జెట్లు స్వదేశీ సాంకేతికతతో హెచ్ఏఎల్ ద్వారా తయారు చేయబడుతున్నాయి. ఇవి ఆధునిక రాడార్ వ్యవస్థలు, అధునాతన ఆయుధ సామర్థ్యాలు, మెరుగైన యుద్ధ సామర్థ్యాలతో రూపొందుతాయి. ఈ ఒప్పందం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా, దేశీయ రక్షణ ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచే దిశగా ఒక ముందడుగు.
పెరిగిన పరిధి..
2021లో హెచ్ఏఎల్ 83 తేజస్ జెట్ల కోసం రూ.46,898 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. తాజా ఒప్పందం దాని కంటే ఆర్థికంగా, సంఖ్యాపరంగా పెద్దది. 97 జెట్లతో కూడిన ఈ ఒప్పందం, భారత్ యొక్క రక్షణ బడ్జెట్లో పెరుగుతున్న పెట్టుబడులను, అలాగే వైమానిక దళాన్ని ఆధునికీకరించే ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తోంది. ఈ జెట్ల ద్వారా ఐఅఊ యొక్క పోరాట సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది.
మిగ్-21 జెట్లకు వీడ్కోలు
ఈ కొత్త ఒప్పందం సమయంలోనే, హెచ్ఏఎల్ రేపు(సెప్టెంబర్ 26, 2025) 36 పాత మిగ్-21 జెట్లకు వీడ్కోలు పలకనుంది. దశాబ్దాలుగా హెచ్ఏఎల్కు వెన్నెముకగా ఉన్న మిగ్-21 జెట్లు, ఇప్పుడు కాలం చెల్లిన సాంకేతికత కారణంగా ఆధునిక తేజస్ జెట్లకు మార్గం సుగమం చేస్తున్నాయి. ఈ రిటైర్మెంట్ హెచ్ఏఎల్ ఆధునికీకరణ వ్యూహంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది.
ఈ ఒప్పందం హెచ్ఏఎల్ ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచడమే కాక, దేశీయ రక్షణ పరిశ్రమలో ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది. అదనంగా, ఈ జెట్ల ఉత్పాదన, నిర్వహణ స్థానిక సాంకేతిక నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఒప్పందం భారత్‌ను రక్షణ ఉత్పాదనలో స్వావలంబన దిశగా నడిపిస్తూ, విదేశీ ఆధారితను తగ్గించే లక్ష్యాన్ని బలపరుస్తుంది.