మన కడుపు నిండితేనే సరిపోదు.. మనకంటే పేదవాళ్ల కడుపులు కూడా నింపాలి. అప్పుడు మన జన్మకు సార్థకత.. అందుకే ప్రతీ భారతీయుడిలోనూ ఇది ఉంటుంది. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ కూడా విశ్వ యవనికపై దీన్ని చాటి ప్రపంచదేశాల ప్రజల మనసులో చెరగని ముద్రవేసుకున్నాడు.. ఓవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వ్యాక్సిన్ మొదట మా దేశంలో తయారైతే ఎవ్వరికి ఇవ్వమని అమెరికన్లకే వాడుకుంటామని స్వార్థం చూసుకున్నారు.. ఇక రష్యా కూడా వారి దేశస్థులకే మొదటి ప్రిఫర్ ఇచ్చింది. అయితే భారత్ లో కరోనా టీకా సిద్ధమైతే ప్రపంచదేశాలకు అందిస్తానని ప్రధాని మోడీ తాజాగా ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రకటన యావత్ ప్రపంచదేశాలను.. భారతీయులను ఉప్పొంగేలా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కరోనా వ్యాక్సిన్ ను భారతీయులకే కాదు.. ప్రపంచదేశాలకు కూడా అందిస్తామన్న మోడీ ప్రకటనపై అందరూ శభాష్ అంటున్నారు. ఈ ప్రకటన చేసిన ప్రధాని మోడీపై తాజాగా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) సీఈవో అదర్ పూనావాలా ప్రశంసలు కురిపించారు. ట్విట్టర్ ద్వారా స్పందించారు. వ్యాక్సిన్ కొనుగోలు చేసి పంపిణీ చేయడానికి ప్రభుత్వం నుంచి రూ.80వేల కోట్లు అవసరమవుతాయని వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఐక్యరాజ్యసమితిలో మోడీ ప్రసంగించడం ఆనందం కలిగించిందని పూనావాలా తెలిపారు.
మోడీ ప్రకటన భారత్ గర్వించదగ్గ సందర్భమని పూనావాలా ఆనందం వ్యక్తం చేశారు. దేశం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు భారతీయుల అవసరాలు తీర్చగలవని.. దీంతో స్పష్టమవుతోందని అని అదర్ పూనావాలా వ్యాఖ్యానించారు.. మోడీ నాయకత్వానికి.. మద్దతుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పూనావాలా తెలిపారు.
ఇప్పటికే ముంబైకి చెందిన సీరమ్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా టీకాను తయారు చేస్తోంది. 1 బిలియన్ డోసుల ఉత్పత్తికి సీరమ్ రెడీగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వ్యాక్సిన్ తయారీదారు ‘సీరమ్ ఇనిస్టిట్యూట్’ కావడం విశేషం. అందుకే మోడీ ప్రపంచంలోని అందరికీ తమ దేశం నుంచి కరోనా వ్యాక్సిన్ అందిస్తామని చేసిన ప్రకటన అందరి మనసులను దోచుకుంది.