ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలోని లంక గ్రామాల్లో వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా నది వరద ఉధృతి పెరగడంతో తీర ప్రాంతాల్లోని గ్రామాలకు ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తాజగా ఉద్దండరాయుని పాలెంలోకి వరదనీరు భారీగా వచ్చింది. దీంతో గ్రామంలోని కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాయి. సమాచారం అందుకున్న తుళ్లూరు ఎమ్మార్వో లీల కుమారి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరద నీటిలో మునుగుతున్న ఇళ్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కృష్ణా నది వరద మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉన్నందున తీర ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.