Akash Prime Missile : మొన్నటికి మొన్న పాకిస్తాన్ దేశంపై ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత మన శక్తి సామర్థ్యం.. మన ఆయుధ సామర్థ్యం ప్రపంచానికి అర్థమయ్యాయి. దీంతో అనేక దేశాలు మనల్ని ప్రత్యేకంగా చూడటం మొదలుపెట్టాయి. అయితే దానిని అక్కడితోనే భారతదేశం వదిలిపెట్టడం లేదు. అంతకుమించి అనే స్థాయిలో ఆయుధాలను, క్షిపణులను తయారు చేస్తోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత మన డిఆర్డిఓ తయారు చేసే ఆయుధాలు, ఆయుధ సామగ్రి మీద ప్రపంచ దేశాలకు ఒక నమ్మకం ఏర్పడింది. కచ్చితంగా ఇవి లక్ష్యాలను చేదిస్తాయని.. పకడ్బందీగా పనిచేస్తాయని ప్రపంచ దేశాలు ఒక అంచనాకు వచ్చాయి. ఈ క్రమంలో మరింత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిఆర్డిఓ ఆయుధాలను తయారు చేయడం మొదలుపెట్టింది. ఆయుధ సామగ్రి తయారీ విధానంలోనూ ఇదే ఒరవడి కొనసాగిస్తోంది. తయారుచేసిన ఆయుధ సామగ్రిని పరీక్షిస్తోంది. ఆ పరీక్షలు అద్భుతమైన ఫలితాలను అందిస్తున్న నేపథ్యంలో డిఆర్డిఓ ప్రయోగాలకు తిరుగులేకుండా పోయింది.
గతంలో విదేశాలలో తయారైన యుద్ధ విమానాలను, మిస్సైల్స్ ను భారత్ కొనుగోలు చేసేది. దీనివల్ల భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వచ్చేది. అయితే స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భారత్ విదేశాలకు సంబంధించిన ఆయుధ సామగ్రిని, మిస్సైల్స్ ను కొనుగోలు చేయడం దాదాపుగా తగ్గించింది. అంతేకాదు గతంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మిస్సైల్స్, ఇతర ఆయుధ సామగ్రికి స్వదేశీ పరిజ్ఞానాన్ని జోడిస్తోంది. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్ -400 కు స్వదేశీ పరిజ్ఞానాన్ని భారత్ జోడించింది. తద్వారా దాయాది దేశం మన మీద ప్రయోగించిన అస్త్రాలు మొత్తం సర్వనాశనమయ్యాయి.. మధ్యలోనే అవి కూలిపోయాయి. తద్వారా మనకు పెద్దగా నష్టం జరగలేదు.
స్వదేశీ పరిజ్ఞానం అద్భుతమైన ఫలితాలను అందించిన నేపథ్యంలో డి ఆర్ డి ఓ అనేక అస్త్రాలను తయారు చేస్తోంది. అందులో ఆకాష్ ప్రైమ్ ఒకటి. ఇది పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసింది.. ఆర్మీ ఆధ్వర్యంలో డి ఆర్ డి వో అధికారులు లడ్డాఖ్ ప్రాంతంలో దీనిని ప్రయోగించారు. దీనిని ఏకంగా 15 వేల అడుగుల ఎత్తులో పరీక్షించారు. నింగిలో రెండు వేగంగా ఎగిరే టార్గెట్లను ఇది అత్యంత విజయవంతంగా ధ్వంసం చేసింది. శత్రుదేశాలకు చెందిన డ్రోన్లను, యుద్ద విమానాలను సమర్థవంతంగా ఎదుర్కొంది. తక్కువ ఆక్సిజన్ ఉన్న ప్రాంతంలోనూ ఈ మిస్సైల్ అద్భుతంగా పనిచేయడం విశేషం.. ఇక ఇప్పటికే డిఆర్డిఓ తయారుచేసిన ఆయుధాలను కొనుగోలు చేయడానికి బ్రెజిల్ ముందుకు వచ్చింది. వివిధ రకాల మిస్సైల్స్ కూడా కొనుగోలు చేస్తామని బ్రెజిల్ తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఆకాష్ ప్రైమ్ అద్భుతంగా పనిచేసిన నేపథ్యంలో ప్రపంచ దేశాల నుంచి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని డిఆర్డిఓ అంచనా వేస్తోంది.