దేశీయ, అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న నానుడిని మరోసారి నిజం చేస్తూ.. దాయాది దేశాల అధినేతలు అనూహ్య వ్యూహాలతో రెండు దేశాల ప్రజలను ఆశ్చర్యాలతో ముంచెత్తుతున్నారు. అంతర్జాతీయంగా మారిన పరిస్థితులు, కొత్త అవసరాల రీత్యా భారత్, పాకిస్తాన్లు మరోసారి శాంతిబాట పట్టాయి. గడిచిన రెండేళ్లుగా మూసుకుపోయిన దారులన్నీ తిరిగి తెరిచేందుకు సిద్ధం అవుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యవర్తిత్వం ఫలించగా.. మోదీ సైతం సంచలనానికి వెనుకాడడం లేదు.
ఇన్నాళ్లు పాకిస్తాన్ ను మోదీ చాలా రకాలుగా కామెంట్ చేశాడు. మాటలతోనే కాదు గడిచిన రెండేళ్లలో భారత్ తన చేతలతోనూ పాకిస్తాన్ ను చాలా రకాలుగా ఎండగట్టే ప్రయత్నం అయితే చేసింది. సందర్భం ఏదైనా.. పాకిస్తాన్ ఉగ్రనీతిని ప్రస్తావించడం మోదీకి ఒక అలవాటుగా మారింది. అయితే ఇప్పుడు సీన్ మరోలా మారింది. పాకిస్తాన్ తో స్నేహం కోరుతూ.. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు భారత ప్రధాని మోదీ ఓ లేఖను రాశారు.
దాయాది పాకిస్తాన్ లో మార్చి 23న జాతీయదినోత్సం(పాకిస్తాన్ డే) నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెబుతూ.. మోదీ అధికారికంగా ఓ సందేశాన్ని పంపించారు. ఆ లేఖలోనే రెండు దేశాల మధ్య స్నేహం, ఉగ్ర సంబంధిత సమస్యలను కూడా ప్రస్తావించారు. పాకిస్తాన్ తో భారత్ స్నేహాన్ని కోరుకుంటోందని మోదీ లేఖలో పేర్కొన్నారు. కరోనా విలయం కారణంగా మానవాళి కష్టాలను ఎదుర్కొంటోందని, ఆ మమ్మమ్మారి తో పోరులో పాకిస్తాన్ ప్రజలు విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు మోదీ తెలిపారు.
రెండు రోజుల క్రితం కరోనా బారిన పడిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ త్వరగా కోలుకోవాలని మోదీ ట్విట్ చేయగా.. మరోసారి లేఖరాసి దాయాదితో స్నేహసంబంధాల అంశాలతో పాటు చురకలు కూడా అంటించారు. పాకిస్తాన్తో భారత్ స్నేహాన్ని కోరుకుంటోందని అంటూనే.. కొన్ని నిబంధనలు పెట్టారు. పుల్వామా ఉగ్రదాడి, అనంతర పరిణామాల్లో భారత్, పాక్ తీవ్రంగా వాదులాడుకోవడం, పరస్పరం దాడులు చేసుకోవడం, యుద్ధానికి సైతం సిద్ధం అవడం తెలిసిందే. అయితే బంధాలను పునరుద్ధరించే దిశగా ప్రధాని మోదీ చొరవ, ఇమ్రాన్ కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.