
అరుణాచల్ ప్రదేశ్ లో యురేనియం నిక్షేపాల జాడ కొనుగొనేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై చైనా అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. ఈ మేరకు చైనా అధికార వార్తా పత్రి ‘గ్లోబల్ టైమ్స్’ కథనం ప్రచురించింది. ఆ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టడం చట్ట విరుద్ధమని తమ దేశ అధికారులు అంటున్నట్టు ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. దీనిపై అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి డొమినిక్ తాడర్ స్పందిస్తూ.. ‘మా రాష్ట్రంలో, మా భూభాగంలో మేం పనిచేసుకుంటాం. చైనాకు వచ్చిన ఇబ్బంది ఏంటీ’ అని ప్రశ్నించారు. దీంతో.. అసలు చైనా చెబుతున్న అభ్యంతరం ఏంటీ? ఎందుకు అనేది చర్చనీయాంశంగా మారింది.
దక్షిణ టిబెట్ లోని షియోమి జిల్లాలో భారత నిపుణులు యురేనియం కనుగొన్నారు. అయితే.. అక్కడ తవ్వకాలు చేపట్టేందుకు చైనా అడ్డు చెబుతోంది. దీని కారణం ఏమంటే.. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతం వివాదాస్పద భూభాగం అన్నది చైనా ఆరోపణ. ఈ రాష్ట్రం మొత్తం దక్షిణ టిబెట్ లో భాగమని చైనా వాదిస్తోంది. ఈ కారణం చేతనే.. ఈ రాష్ట్రంపై భారత సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి చైనా నిరాకరిస్తోంది.
ఇప్పుడు యురేనియం నిక్షేపాలు ఉన్నట్టు చెబుతన్న షియోమి జిల్లా చైనా సరిహద్దులో ఉంటుంది. అందుకే.. ఇది వివాదాస్పద ప్రాంతం కాబట్టి, ఇక్కడ భారత్ ఏకపక్షంగా తవ్వకాలు జరపొద్దన్నది ఆ దేశం వాదన. ఇలాంటి నిర్ణయాలు రెండు దేశాల మధ్య చర్చల ప్రక్రియను సంక్లిష్టం చేస్తాయంటూ రాసుకొచ్చింది గ్లోబల్ టైమ్స్ పత్రిక.
అంతేకాదు.. ఇండియా చేపడుతున్న ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని సింఘవా యూనిర్సిటీలో ‘ఇండియన్ స్టడీస్’ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న షిచావో చైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్టుగా గ్లోబల్ టైమ్స్ రాసుకొచ్చింది. దీనిపై ఇండో-చైనా సరిహద్దు వివాదాలు, సైనిక వ్యూహాలపై అవగాహన ఉన్న రూపక్ భట్టాచార్య స్పందించారు.
1969 నుంచి జరిపిన పరిశోధనల్లో రాష్ట్రానికి పశ్చిమాన ఉన్న పలు జిల్లాల్లో యురేనియం బయటపడినట్టు ఆయన చెప్పారు. యురేనియం లభించే ప్రాంతాలన్నీ వాస్తవాధీన రేఖకు దగ్గరగా ఉన్నందు వల్ల చైనా ప్రతీసారి పేచీపెడుతోందని చెప్పారు. ఇక, గ్లోబల్ టైమ్స్ పత్రిక గురించి కూడా చెప్పారు. అది కేవలం చైనా అధికార పార్టీ మౌత్ పీస్ అని అన్నారు. వాళ్లు చెప్పింది రాయడమే ఈ పత్రిక పని అని, రెచ్చగొట్టేలా కథనాలు రాస్తుందని చెప్పారు. అందువల్ల ఈ పత్రికను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.
యురేనియం ప్రధానంగా అణ్వాయుధాల్లో వాడటానికి ఉపయోగిస్తారు. ఇది అత్యంత విలువైన ఖనిజం. దీనిని శుద్ధి చేయడం కూడా ఎంతో క్లిష్టమైన అంశం. అయితే.. ఎంతో విలువైన ఈ ఖనిజాన్ని భారత్ ఉపయోగించుకోకుండా చేయాలనే ఉద్దేశంతోనే చైనా ఇలాంటి కొర్రీలు పెడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగానే మీడియా చెప్పినట్టుగా కథనాలు రాయిస్తోందని అంటున్నారు. చైనా తీరుపై భారత్ లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దులో రెచ్చగొట్టే చర్యలు చేపట్టడమేకాకుండా.. ఇలా భారత అంతర్గత భూభాగంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం మానుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.